ఆక్రమణలకు హైడ్రా చెక్
రెండు ప్రాంతాల్లో ఆపరేషన్స్
పుప్పాలగూడ, హైదర్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపు
డాలర్ హిల్స్‌లోనూ ఇదే తరహా కథ
పుప్పాలగూడలోని డాలర్ హిల్స్‌లోనూ ఆక్రమణల్ని హైడ్రా తొలగించింది. సర్వే నం. 104/1, 106, 113ల్లో సంతోష్‌రెడ్డి, ఆయన మిత్రులకు 60 ఎకరాల భూమి ఉంది. ఇందులోని 30 ఎకరాల్లో 1998లో డాలర్ హిల్స్ లే ఔట్ వేశారు. హెచ్‌ఎండీఏ ప్రిలిమినరీ లేఔట్‌తో మొత్తం 80 శాతం ప్లాట్లు అమ్మేశారు. ఆపై లేఔట్ రద్దయ్యేలా ప్రయత్నించి 2005లో చేయించారు. ఆపై స్థల యజమానులు కుమక్కై వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు. ఈ విషయం అప్పటికే ప్లాట్లు కొన్న వారికి తెలీదు. ఎల్‌ఆర్‌ఎస్‌తో అనుమతులు తీసుకుని కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. సంతోష్‌రెడ్డి తదితరులు ఈ లేఔట్‌లోని రెండు ఎకరాల పార్కు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను కలిపి పక్కనే ఉన్న 30 ఎకరాల భూమికి జోడించారు. దీన్ని ఎన్‌సీసీ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మేశారు. 2016 నుంచి ఈ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ అనుమతులు తీసుకోకుండా ఎన్‌సీసీ నిర్మాణాలు చేపడుతోందని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 14న క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా హైడ్రా సోమవారం అక్కడి నిర్మాణాలు తొలగించింది. అనుమతి లేకుండా సెల్లార్లు తవ్వడం, పేలుడు పదార్థాలను వినియోగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. పార్కులు, రహదారులు ఆక్రమించిన కేసుల్లో ఇంప్లీడ్ అవ్వాలని హైడ్రా నిర్ణయించింది.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమ ణలు తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయి విచారణ చేసిన అధికారులు ఆక్రమణలుగా తేల్చి కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో ఉన్న డైమండ్ హిల్స్, మణికొండలోని పుప్పాలగూడలో ఉన్న డాలర్ హిల్స్‌ల్లో కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ఈ రెండు చోట్లా బోర్డులు ఏర్పాటు చేసింది.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ..
హైదర్‌నగర్ సర్వే నం.145లోని 9 ఎకరాల్లో డైమండ్ హిల్స్ పేరుతో లేఔట్ వేశారు. 79 ప్లాట్లతో కూడిన 2000 సంవత్సరం నాటి దీనికి హెచ్‌ఎండీఏ అనుమతి ఉంది. 2007లో అన్ రిజిస్టర్డ్ అసైన్‌మెంట్ డీడ్‌తో డాక్టర్ ఎన్‌ఎస్‌డీ ప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమణలు మొదలెట్టారు. ప్లాట్ యజమానులు పార్టీ కాని కేసుల్లో ఎక్స్ పార్టీ డిక్రీ తీసుకుని బైలీఫ్ ద్వారా వ్యవసాయ భూమి అని చూపుతూ ఏడెకరాలు ఆక్రమించారు. ఆ కేసులో ప్లాట్ యజమానులను పార్టీ చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించి పొందిన బైలీఫ్ అర్డర్‌తో ఈ లే ఔట్‌లోని స్విమ్మింగ్‌పూల్, రహదారులు, పార్కులు, ప్లాట్లు హద్దులు,పునాదులను చెరిపేసి ఆక్రమించారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 9న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రసాద్ ఖాళీ చేయడం లేదని వాపోయారు. ఆ భూమిని వివిధ సంస్థలకు పార్కింగ్ కోసం అద్దెకు ఇస్తూ నెలకు రూ.50 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఔట్‌లోని మిగతా రెండు ఎకరాల్లో ఉన్న ప్లాట్లకు వెళ్లడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ కూడా వేశారని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ గత బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలు నిర్ధారించి సోమవారం వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు.
ఓ ప్రాంతంలో రోడ్డు, పార్కుల్లో ఉన్నవి కూల్చివేత
మరోచోట 9 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమి సంరక్షణ
న్యాయస్థానం ఆదేశాల మేరకే చర్యలు: కమిషనర్
ఆక్రమణలకు హైడ్రా చెక్


