నేడు చీరనేత ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

నేడు చీరనేత ప్రదర్శన

Aug 2 2026 11:43 PM | Updated on Aug 2 2026 11:43 PM

● మూడున్నర గంటల్లో 5.5 మీటర్ల చీరనేతకు ప్రణాళిక

● మూడున్నర గంటల్లో 5.5 మీటర్ల చీరనేతకు ప్రణాళిక

సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చేనేత ప్రత్యక్ష ప్రదర్శనకు సిద్ధమయ్యారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 210 నిమిషాల్లో (3 గంటల 30 నిమిషాల్లో) 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను ప్రత్యక్షంగా నేయనున్నారు. అదే చీరను ప్రత్యేకమైన నైపుణ్యంతో మడిచి 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రదర్శించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామని హరిప్రసాద్‌ శ్రీసాక్షిశ్రీకి ఆదివారం తెలిపారు. చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం, యువతలో చేనేతపై ఆసక్తి పెంపొందించడం, సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మూడున్నర గంటలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. చంద్రంపేట హరిప్రసాద్‌ హ్యాండ్లూమ్స్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి చీర నేయడం ప్రారంభిస్తానని తెలిపారు.

బకాయిలు చెల్లించాలి

సిరిసిల్ల అర్బన్‌: ఉపాధిహామీ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే బకాయిలు చెల్లించాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు కోరారు. ఈమేరకు డీఆర్డీవో లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కూలీలకు ఉపాధి పనులు కల్పించే కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఉద్యోగులకు మూడు నెలలగా జీతాలు అందడం లేదన్నారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్న వీరికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాయకులు సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కనగర్తి శివారులో చిరుత సంచారం?

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తి శివారులో చిరుత ఆనవాళ్లు కనిపించడంతో రైతులు, గొర్లకాపరులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన గొర్ల కాపరులు కనగర్తి–నాగారం మధ్య ఆదివారం గొర్లను మేపడానికి తీసుకెళ్లారు. వారికి నెల్లిబండల ప్రాంతంలో చిరుత పాదముద్రలు కనిపించాయి. వర్షాకాలం కావడంతో నేల తడిగా ఉండడంతో వాటి పాదముద్రలు గుర్తించారు. అటువైపుగా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తోటి కాపరులకు, రైతులకు చెబుతున్నారు. చిరుత సంచరించిందని తెలియడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

వేడుకల్లో సీనియర్‌ సిటిజన్స్‌

సిరిసిల్ల అర్బన్‌: తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య ఆధ్వర్యంలో గాంధీనగర్‌ హనుమాన్‌ మందిరంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ స్నేహమంటే శ్రీకృష్ణ–కుచేలుల మాదిరిగా ఉండాలని, జీవితాంతం ఆసరాగా అండగా నిలిచేదే స్నేహమన్నారు. కోడం నారాయణ, జనపాల శంకరయ్య, దొంత దేవదాస్‌, ఎల్లయ్య, జ్ఞానోబా, కైలాసం, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement