వ్యాపారి చెప్పింది కొంటేనే డీఏపీ, 28–28–0 ఎరువుల విక్రయం ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువులు రూ.700కు చేరిన వైనం బహిరంగ దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న వ్యవసాయాధికారులు
చందుర్తి(వేములవాడ): దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎప్పుడూ దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. పంట పండించినప్పటి నుంచి మార్కెట్‌లో విక్రయించే వరకు రైతుమాట చెల్లడం లేదు. వ్యాపారులు చెప్పిందే అన్నదాతలు వినాల్సి వస్తోంది. ఎరువల వ్యాపారులు రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. డీఏపీ, యూరియా ఎరువులు మినహా మిగతా కాంప్లెక్స్, ఇతర ఎరువుల ధరలు బస్తాకు రూ.700లకు పైగా చేరుకున్నాయి. దుక్కిలో వేసేందుకు ఎక్కువగా డీఏపీ ఎరువులను వినియోగిస్తారు. డీఏపీ బస్తా రూ.1350 ఉండగా.. డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ బస్తా కావాలంటే వారు చెప్పిన వేరే ఎరువు బస్తా కొనాల్సిందే. లేకుంటే డీఏపీ బస్తాలు లేవంటున్నారు. డీఏపీ బస్తాకు లింక్‌గా న్యూట్రియంట్స్, నానో డీఏపీ లేదంటే ఆర్గానిక్ ఎరువుల బస్తాలను అంటగడుతున్నారు.
రైతులపై భారం
ఎరువుల ధరలు అమాంతం పెరడగంతో రైతులపై భారం పడుతుంది. పశ్చిమాసియా యుద్ధంతో ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎరువులకు వినియోగించే ముడిసరుకుల ధరలు పెరగడంతో కాంపెక్స్ ఎరువుల ధర రూ.300 నుంచి రూ.750 వరకు పెరిగాయి. రైతులు ఎక్కువగా వినియోగించే 20–20–0–23 కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ.1450 నుంచి రూ.2150 వరకు పెరిగింది. మ్యూరేట్ ఆఫ్ పొటాస్ రూ.1,750 నుంచి రూ.2,150కి పెరిగింది. 28–28–0 ధర రూ.1800 నుంచి రూ.2,300లకు, సింగిల్ సూపర్ పాస్పేట్ మాత్రం రూ.650 నుంచి రూ.775కు పెరిగింది. పంటల సాగులో యాంత్రీకరణ పెరగడంతో రైతుకు పెట్టుబడి ఖర్చు 40 నుంచి 50 శాతం వరకు పెరిగింది.


