ప్రభుత్వ కార్యాలయాలకు పట్టణంలో స్థలం కరువు మండల పరిషత్ ప్రాంగణంలో కనిపించని ఖాళీ జాగ పట్టణ శివారులో అన్వేషణ ఒకే చోట ఉండాలంటున్న పట్టణ ప్రజలు
వేములవాడ: వేములవాడలోని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కరువైంది. పట్టణంలోని మండల పరిషత్ ప్రాంగణంలో 7.5 ఎకరాలు ఉన్నప్పటికీ ఇప్పటికే ఉన్న కార్యాలయాల భవనాలతో ఖాళీ స్థలం లేదు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో అధికారులు జాగ అన్వేషణలో పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండొద్దన్న జీవోతో భవన నిర్మాణాల కోసం స్థలాన్ని వెతుకుతున్నారు. అయితే పట్టణంలో స్థలం లేకపోవడంతో శివారు ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు.
మండల పరిషత్‌లో కనిపించని జాగ
వేములవాడ మండల పరిషత్ ప్రాంగణంలోని 7.5 ఎకరాల్లో ఇప్పటికే పలు భవనాలు నిర్మించారు. ఈ ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంఘాల భవనాలు, కళామందిరం, క్వార్టర్లు, ఓపెన్‌జిమ్, పార్కు నిర్మించారు. అయితే ఇవి క్రమపద్ధతిలో కాకుండా ఇష్టారీతిగా నిర్మించడంతో ఖాళీ స్థలం కరువైంది. ఇటీవల కలెక్టర్ గరీమా అగ్రవాల్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో కుమారి, తహసీల్దార్ జయంత్ తిప్పాపూర్ ప్రాంతంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.


