● మధ్యమానేరులో ఇన్‌టెక్ వెల్ పరిశీలన ● పంప్‌హౌస్‌లో వాటర్ శాంపిళ్ల సేకరణ ● నల్లా పైపులైన్ లీకేజీల గుర్తింపు
సిరిసిల్ల: జిల్లాలో రంగుమారిన కలుషిత నీరు నల్లాల్లో సరఫరా అవుతోందని, మిషన్ భగీరథ నీరు మురికిగా రావడంతో జనం తాగేందుకు జంకుతున్న తీరుపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘జలమా.. హాలాహలమా’ కథనానికి అధికారులు కదిలారు. మిషన్ భగీరథ ఇన్‌చార్జి సీఈ అమరేంద్ర, ఈఈ ఎం.డీ.ముజాహిద్ అన్వర్ మధ్యమానేరు జలాశయంలోని వాటర్‌సోర్స్ కెనాల్‌ను, ఇన్‌టెక్‌వెల్‌ను పరిశీలించారు. మిషన్ భగీరథకు లభిస్తున్న నీటిని అంచనా వేశారు. అగ్రహారం నీటిశుద్ధి ప్లాంటులో శుద్ధిచేసిన నీటిని పరిశీలించి, ట్రీటెడ్ వాటర్ శ్యాంపిళ్లను సేకరించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పంపుహౌస్‌ల్లోనూ నల్లాలకు సరఫరా అయ్యే నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించనున్నారు. సిరిసిల్ల విద్యానగర్ నెహ్రుపార్క్ వద్ద పైపులైన్ లీకేజీని గుర్తించారు. లోపాలను సవరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ ఈఈ ఎం.డి.ముజాహిద్ అన్వర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో మిషన్‌భగీరథ డీఈఈ రాము, ఏఈఈ మధు సిబ్బంది ఉన్నారు.


