● ప్రమాదాల నివారణ అందరి బాధ్యత ● ఐజీపీ రమేశ్‌నాయుడు
సిరిసిల్ల క్రైం: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఐజీపీ రమేశ్‌నాయుడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది డ్రైవర్లేనన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఓవర్‌స్పీడ్, తప్పుగా ఓవర్‌టేకింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో రోజుకు 70 ప్రమాదాలు నమోదవుతున్నాయని, వాటిలో 20 వరకు మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించడం సురక్షితమని తెలిపారు. ‘రహావీర్’ పథకం కింద ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను ఆస్పత్రికి తరలిస్తే రూ.1.50 లక్షల వరకు చికిత్స సహాయం అందిస్తారని, సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం ఇస్తారని వివరించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, సైన్‌బోర్డుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్కూల్ వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని హెచ్చరించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ డ్రంకెన్‌డ్రైవ్ ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు సీపీఆర్ (ప్రథమ చికిత్స)పై అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, డీఎంహెచ్‌వో రజిత తదితరులు పాల్గొన్నారు.


