హత్యలు.. మోసాలు
రియల్టర్, మాజీ నక్సలైట్ల హత్యతో భయాందోళన
కోసా ఎన్‌కౌంటర్‌తో కన్నీరుపెట్టిన జనం
పెరిగిన సైబర్ మోసాలు
సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే (ఫైల్)
సత్యానారాయణరెడ్డి (కోసా) అంతిమయాత్ర (ఫైల్)
సిరిసిల్లక్రైం: ప్రతీకార హత్యలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందారు. ఓ రియల్టర్.. మాజీ నక్సలైట్‌ల ప్రతీకారహత్యలు.. చందుర్తిలో ఆస్తి తగాదాలో ఓ మహిళ ప్రాణాలు తీసిన సంఘటనలు కలకలం రేపాయి. దొంగతనాలు, దోపిడీలు తగ్గినా సైబర్‌మోసాలు పెరిగిపోయాయి. సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని జిల్లా ప్రజలు భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు చాకచక్యంగా అంతరాష్ట్ర సైబర్‌మోసగాళ్లను పట్టుకున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఫలించి నేరాలశాతం తగ్గాయి. అదే సమయంలో హత్యలు.. దాడులతో 2025లో జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
చందుర్తిలో మహిళ దారుణ హత్య
రెండు కుటుంబాల మధ్య 20 గుంటల భూమి తగాదాలో చందుర్తి మండల కేంద్రంలోని తన పెద్దమ్మను ఓ యువకుడు మే 26వ తేదీన హత్య చేశాడు. అదే కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తానే చంపినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సదరు యువకుడు గతంలోనూ ఓ హత్య చేయడంతో పీడీయాక్ట్ నమోదు చేశారు.
సిరిసిల్లలో రియల్టర్..
సిరిసిల్ల మాజీ కౌన్సిలర్, రియల్టర్ సిరిగిరి రమేశ్(48)ను అతని భాగస్వాములే హత్య చేశారు. అతని కారులోనే అందరూ కలిసి వెళ్లి వెంట తీసుకెళ్లిన కత్తితో గొంతు కోశారు. సెప్టెంబర్ 20న రమేశ్ మృతదేహాన్ని వేములవాడ నందికమాన్ సమీపంలోని అతని వెంచర్‌లో కారును వదిలేసి వెళ్లడం కలకలం రేపింది. వారం రోజుల తర్వాత హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రతీకారంతో సిద్ధన్న హతం
నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన కాలంలో దళం సూచనలతో తాను ఒకరిని చంపిన విషయాన్ని మాజీ నక్సలైట్ సిద్ధన్న(బల్లెపు నర్సయ్య) ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూను చూసిన సదరు మృతుని కొడుకు జక్కుల సంతోష్.. సిద్ధన్నతో స్నేహం పెంచుకొని పథకం ప్రకారం అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి బండతో మోది హతం చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోవడంతో హత్య విషయం వెలుగుచూసింది.
కోసా ఎన్‌కౌంటర్
మావోయిస్టు అగ్రనేత కోసా ఉరఫ్ కడారు సత్యనారాయణరెడ్డి సెప్టెంబర్ 22న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లికి చెందిన కోసా 1980లో అజ్ఞాతంలోకి వెళ్లారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. విద్యావంతుడుగా ఉద్యోగంలో స్థిరపడిన సత్యనారాయణరెడ్డి పీడిత ప్రజల కోసం నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి సుదీర్ఘకాలం పనిచేశారు.
మద్యం మత్తులో కారునడిపి..
మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మృతికి కారణ మైన ఘటన జూన్ 20న జరిగింది. తంగళ్లపల్లి మండలం నేరళ్ల శివారులో సిద్దిపేట వైపు నుంచి తంగళ్లపల్లి వైపు వస్తూ ద్విచక్రవాహదారుడు కుర్మ నరేశ్(38)ను కొరు ఢీకొట్టింది. అక్కడే ఉన్న వారందరూ కారులోని యువకుడిని నిలదీయగా.. కేసు పెడితే జైలుకు పోతానని మద్యంమత్తులో చిందులు వేయ డం అక్కడి వారిని హతాశులను చేసింది. ఆస్పత్రికి తరలించేలోపే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు.
అధికార, ప్రతిపక్ష పార్టీల లడాయి
అభివృద్ధి పథకాలు, పనుల ప్రారంభోత్సవంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో లేదని బీఆర్‌ఎన్ నేతలు నిరసనలు తెలిపారు. మే నెలలో జరిగిన ఈ వివాదం ఎమ్మెల్యే కేటీఆర్ అధికారిక నివాసంపై కాంగ్రెస్ నేతల దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
స్మార్ట్‌గా చీటింగ్
సైబర్‌నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇటీవల సెస్ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగికి వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయగా అతని ఖాతాలో ఉన్న రూ.13లక్షలను సైబర్ మోసగాళ్లు కాజేశారు. జిల్లాలో ఇలా ఏడాదిలో 114 కేసులు నమోదు కాగా.. రూ.67.93 లక్షలను సైబర్ విభాగం హోల్డ్ చేసి అందులోంచి రూ.39.11లక్షలు రికవరీ చేసింది.
హత్యలు.. మోసాలు
హత్యలు.. మోసాలు
హత్యలు.. మోసాలు


