విజయోత్సాహం
● హామీలు అమలు చేస్తున్న సర్పంచులు ● కోతుల బెడద తీర్చేందుకు చర్యలు ● నీటి సమస్యకు బోరు, మోటార్లతో చెక్ ● ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నం
బోయినపల్లి(చొప్పదండి): రెండేళ్ల ఎదురుచూపుల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పలువురు అభ్యర్థులు తమదైన ప్రత్యేక హామీలు ఇచ్చారు. మరికొందరు మేనిఫెస్టో విడుదల చేశారు. సర్పంచ్ అభ్యర్థులు ఇచ్చిన హామీలు నమ్మి పలు గ్రామాల్లో గెలిపించారు. ఇలా గెలిచిన సర్పంచులు విజయోత్సాహంలో ప్రధాన హామీలను అమలు చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే రూ.5వేలు.. కోతులను తరిమికొట్టడం.. గ్రామంలో నీటి సమస్య పరిష్కారం.. రూపాయికే ప్యూరిఫైడ్ వాటర్.. ఇలాంటి హామీలను కొత్తగా ఎన్నికై న సర్పంచులు నెరవేరుస్తున్నారు.
హామీల అమలులో ముందు..
● తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్ పూర్మాని రాజశేఖర్‌రెడ్డి తమ గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.5వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్, పెళ్లికి రూ.5వేలు నగదు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఈ ఏడాది గ్రామంలో జన్మించిన 9 మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున పోస్టల్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
● బోయినపల్లి మండలం విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆడపిల్ల పుడితే రూ.5వేలు ఇస్తామనే హామీతో ఒకరికి రూ.5వేలు అందించారు. రూపాయికే 20 లీటర్ల ప్యూరిఫైడ్ నీటిని అందించే పనులు ప్రారంభించారు. మండలంలోని దుండ్రపల్లిలో ఏళ్ల తరబడి చెత్త ట్రాక్టర్ మూలకుపడి ఉంది. సర్పంచ్ జంగం అంజయ్య గెలిచిన వెంటనే చెత్త ట్రాక్టర్‌ను మరమ్మతు చేయించారు. వీధిలైట్లు బిగించారు. కోతుల బెడద తీర్చేందుకు కొండముచ్చును తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గుండన్నపల్లి సర్పంచ్ కొప్పుల లావణ్య గ్రామంలో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. బోయినపల్లి సర్పంచ్ నల్ల మోహన్ 9వ వార్డు ఎస్సీకాలనీలో తన సొంత నిధులతో బోరు వేయించారు.
● వీర్నపల్లి మండలం బావుసింగ్‌తండా సర్పంచ్ నీటి కొరత తీర్చేందుకు బోరు ఈనెల 27న సొంత డబ్బులతో బోరు వేయించారు.
ఈ ఉత్సాహం ఉండాలి ఐదేళ్లు
సర్పంచులుగా గెలిచిన వారు నూతన ఉత్సాహంతో హామీలు అమలు చేస్తున్నారని.. ఇదే తీరు ఐదేళ్లు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు సర్పంచులు జవాబుదారీగా ఉండాలని, అభివృద్ధి పనులు చేపట్టే లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. బోయినపల్లి, తడగొండ, వెంకట్రావుపల్లి, అనంతపల్లి గ్రామాల్లో కోతుల బెడద తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
విజయోత్సాహం


