ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఆత్మీయ సన్మానం
వేములవాడఅర్బన్: ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు గెలవడం శుభపరిణామమన్నారు. కులం ఒక బలం.. బలగమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ముదిరాజ్ కులస్తులైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వెన్షన్‌హాల్‌లో శ్రీపెద్దమ్మతల్లి ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జ్యోతిరావుపూలే, సావిత్రి బాయిపూలే విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముదిరాజ్‌లపై ఉన్న ప్రేమతో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. గ్రామాల్లో అందరి ప్రేమను పొందుతూ ముందుకుపోవాలని సూచించారు. ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుందనేందుకు వేములవాడ నియోజకవర్గం నిదర్శనమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, నాయకులు ఉన్నారు.
విస్తరణ పనులు వేగవంతం చేయాలి
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం విస్తరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. వేములవాడలోని తన నివాసంలో ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు, స్థపతి, ఆర్కిటెక్, కాంట్రాక్టర్‌లతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పనులు నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ఐఐటీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, స్ట్రక్చరల్ ఇంజినీర్ శ్రీధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, బీఎస్సీ అధికారులు రాము, నరసింహచారి, దేవాదాయ ధర్మాదాయశాఖ స్థపతి వల్లినాయగం, ఈఈ దుర్గాప్రసాద్, ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, మహిపాల్‌రెడ్డి, ఏఈవో అశోక్‌కుమార్, అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, మామిడిపల్లి శరత్‌శర్మ పాల్గొన్నారు.
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్
సిరిసిల్లటౌన్: సంక్షేమ పాలనకు కాంగ్రెస్ కేరాఫ్‌గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ 140వ ఆవిర్భావ వేడుకలు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతి థిగా ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ప్రతీ పేద ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అందాయన్నారు. బీజేపీ దేశంలో కులాలు, మతాల ప్రాతిపదికన పాలన సాగిస్తోందని విమర్శించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం డీసీసీ ఆఫీసులో జెండా ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూప, కాముని వనిత, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు.


