పొలాలకు సెక్యూరిటీ
కోనరావుపేట(వేములవాడ): వ్యాపార సముదాయాలు.. బ్యాంకులు... నివాసాలు ఉన్న ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. కానీ పంట పొలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వింతే. కానీ ఇది నిజం. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామ రైతులు పంట పొలాల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
దొంగతనాలకు చెక్
పొలాల వద్ద వ్యవసాయ సామగ్రి, కరెంట్ వైర్లు, మోటార్లు ఉంటాయి. కొన్ని సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్‌మోటార్లు, వైర్లు, వ్యవసాయ పరికరాలను ఎత్తుకెళ్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నీటిపైపులను సైతం కోసుకెళ్తుంటారు. అసలే అంతంతే లాభాలు వచ్చే వ్యవసాయంలో ఈ దొంగతనాలు రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ పంట పొలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని రైతులు తమ సెల్‌ఫోన్లకు అనుసంధానించుకోవడంతో పొలాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి పొలాల వద్ద వస్తువులు మాయం కావడం లేదు.


