‘వంతెన’ వెతలు తీరేదెన్నడో..!
మట్టిరోడ్డు పనులనైనా పూర్తిచేయాలి
● హైలెవల్ వంతెన పనుల్లో అలసత్వం ● గంభీరావుపేట మండల కేంద్రానికి మూడు నెలలుగా స్తంభించిన రాకపోకలు ● ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై దాదాపు రూ.10కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెన నిర్మాణ పనుల్లో జాప్యంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం ఏళ్లనాటి పాత బ్రిడ్జిని అనాలోచితంగా కూల్చివేసి దాని స్థానంలో తాత్కాలికంగా మట్టిరోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పొంగి పొర్లడంతో వాగు ఉధృతి పెరిగి మట్టి రోడ్డూ కొట్టుకుపోయింది. దీంతో గంభీరావుపేట మండల కేంద్రానికి మూడు నెలలుగా రాకపోకలు స్తంభించి పోయాయి.
పాతది ఎందుకు కూల్చారో..
జిల్లాలో ఎక్కడా నూతనంగా బ్రిడ్జి నిర్మించినా పాత బ్రిడ్జిలను అలాగే ఉంచుతారు. ఇందుకు ఉదాహరణ గంభీరావుపేట మండలం గోరింటాల మూలవాగుపై పాత, కొత్త బ్రిడ్జిలు, అలాగే ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె వద్ద కూడా అలానే ఉన్నాయి. కానీ గంభీరావుపేటలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకుండానే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టక ముందే పాత బ్రిడ్జిని కూల్చేశారు. దానిస్థానంలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయగా అది కాస్త వాగు ఉధృతిలో కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పాత బ్రిడ్జి ఉండి ఉంటే రెండు మూడు రోజులు మాత్రమే రవాణాకు ఇబ్బందులు ఉండేది.
పెరిగిన దూరభారం
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర అవసరాల కోసం వచ్చే ప్రయాణికులకు దూర భారం పెరిగింది. బస్సుల రాకపోకల విషయంలో గందరగోళం నెలకొంది. మూడు కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం 10–15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనివల్ల సమయం వృథా కావడమే కాకుండా అదనపు ఖర్చు భారం పడుతోంది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు, ఇబ్బంది పడుతున్నారు. కిలోమీటర్ దూరం కూడా లేని పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు పది కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సి పరిస్థితులు నెలకొన్నాయి.
విద్యార్థులకు ‘పరీక్షే’
రెండు రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. కళాశాలకు దాదాపు 500 మందికి పైగానే వాగు అవతల ఉన్న గ్రామాలు, పక్క మండలాల నుంచి వస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా చుట్టూ తిరిగి రావడం వల్ల కొన్ని తరగతులు కోల్పోయారు. పరీక్షలు మొదలు కానున్నందున ఉదయం 8.30గంటల లోపే పరీక్ష హాల్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. దూరభారం వల్ల సమయానికి పరీక్షా హాల్‌కు చేరుకునే వీలు కలిగేలా లేదు. విద్యార్థులు దూర ప్రయాణంతో టెన్షన్‌కు గురవుతున్నారు.
వాగు నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులు ఏ రూట్లో వస్తున్నాయో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. దగ్గరి ఊరికి వెళ్లాలన్నా గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి త్వరగా హైలెవల్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
– అంబటి దేవరాజు, గంభీరావుపేట
రెండు రోజుల్లో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాలు తిరుగుతూ దూర ప్రయాణం చేస్తూ కాలేజీకి వస్తున్నాం. క్లాసులు మిస్ అవుతున్నాం. ఇప్పుడు పరీక్షల సమయానికి ఎలా చేరుకునేదో అర్థం కావడం లేదు. తాత్కాలిక మట్టిరోడ్డునైనా పూర్తి చేయాలి.
– అనిల్, డిగ్రీ విద్యార్థి, నామాపూర్, ముస్తాబాద్
హైలెవల్ నిర్మాణ పనులు అటుంచితే.. కనీసం తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణ పనులనైనా త్వరగా పూర్తి చేయాలి. విద్యార్థులకు పరీక్షలు మొదలు కానున్నందున వారికి నష్టం జరుగకుండా మట్టి రోడ్డును పూర్తి చేసి పరీక్షలు రాసేలా చూడాలి.
– గొండ్లె తిరుపతి,
ఏబీవీపీ జిల్లా నాయకుడు, లింగన్నపేట
‘వంతెన’ వెతలు తీరేదెన్నడో..!
‘వంతెన’ వెతలు తీరేదెన్నడో..!
‘వంతెన’ వెతలు తీరేదెన్నడో..!


