మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవదాసు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గౌస్, మత్స్య శాఖ జిల్లా అధికారి సౌజన్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లోని జక్కుల చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం రాయితీతో చేప పిల్లలను అందిస్తుందన్నారు. దీన్ని ఉపయోగించుకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. మత్స్యకారుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేపల సంపద పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ పని శివరామకృష్ణ, అధికారులు కిరణ్, సతీశ్, వెంకటేశ్, నాయకులు బండారి బాల్‌రెడ్డి, కొండాపురం శ్రీనివాస్‌రెడ్డి, కదిరే శ్రీనివాస్, ఎడ్ల రాజ్‌కుమార్, చింతల పోచయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


