రేపు ‘రంగవల్లి విజ్ఞాన కేంద్రం’ వార్షికోత్సవం
సిరిసిల్ల/వేములవాడఅర్బన్: వేములవాడ నంది కమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే)లో మంగళవారం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. వార్షికోత్సవ కరపత్రాలను ఆదివారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శిగా పని చేస్తూ.. రంగవల్లి అలియాస్ లలితక్క 1999 నవంబరు 11న ములుగు జిల్లా జగ్గన్నగూడెం వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆమె స్మారకార్థం వేములవాడ నంది కమాన్ వద్ద గతేడాది రంగవల్లి విజ్ఞాన కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఆమె పేరిట నెలకొల్పిన విజ్ఞాన కేంద్రానికి ఏడాది నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నా రు. సభా పరిచయం పోకల సాయికుమార్ చేయనుండగా.. అరుణోదయ విమలక్క (ఆర్‌వీకే అధ్యక్షురాలు) సభాధ్యక్షత జరుగుతుంది. ‘సంక్షోభ కాలం.. సామాజిక మార్పు’ అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల వక్తగా, రాజేశ్వరి (ఆర్‌వీకే సభ్యులు) అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ‘ప్రజాగ్రంథాలయం ఆవశ్యకత’ అంశంపై ప్రముఖ కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతారు. ఆర్‌వీకే సభ్యులు చెన్నమనేని పురుషోత్తమరావు వందన సమర్పన చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. రంగవల్లి విజ్ఞాన కేంద్రం సభ్యులు రాజేశ్వరి, చెన్నమనేని పురుషోత్తమరావు, పోకల సాయికుమార్, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మి, లత, అంజా గౌడ్, నందం, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.


