ప్రతిభావంతులకు పతకాలు
పేదరికాన్ని జయించి.. సరస్వతి పుత్రికలుగా రాణించి
గోల్డ్‌మెడల్ సాధించిన అక్కాచెల్లెళ్లు
చందుర్తి (వేములవాడ): పేదరికంలో పుట్టినా.. సరస్వతి పుత్రికలుగా రాణిస్తున్నారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేసే దిశగా అడుగు వేస్తున్నారు అక్కాచెల్లెళ్లు. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కాదాసు సుగుణ–లింబాద్రి దంపతులకు ముగ్గురు కూతుళ్లు నవ్య, నర్మద, నీరజ. వ్యవసాయంతో తండ్రి కుటుంబ భారాన్ని మోయలేక జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. తల్లి వ్యవసాయ పనులు చేస్తోంది. వీరి కూతుళ్లు ప్రభుత్వ కొలువులే లక్ష్యంగా ఎంఏ బీఈడీ చేశారు. పెద్ద కూతురు నవ్య, నర్మదకు వివాహాలు కాగా, ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
పసిడి పతకాలు..
కాదాసు నర్మద, నీరజ వేములవాడ మండలం ఆగ్రహారం కళాశాలలో 2020–22 విద్యా సంవత్సరంలో తెలుగులో ఎంఏ పూర్తి చేశారు. నర్మద ఎంఏ తెలుగులో అత్యధిక మార్కులు సాధించింది. ఆధునిక కవిత్వం, వ్యాకరణం, భాష చరిత్ర, ఆధునిక సాహిత్య విమర్శ ఆంశంలో నాలుగు బంగారు పతాకాలు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. నీరజ జానపద విజ్ఞానం అనే ఆంశంలో అత్యధిక మార్కులు సాధించింది. ఇటీవల ఇద్దరూ కరీంనగర్ శాతావాహన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదగా బంగారు పతకాలు అందుకున్నారు. దీంతో వీరి ఆనందానికి అవదులే లేకుండాపోయాయి.


