ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● హన్మాజీపేట పీహెచ్‌సీ, జెడ్పీహెచ్‌ఎస్ తనిఖీ
వేములవాడరూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని పరిశీలించారు. వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ గర్భిణీలు అందరూ ప్రభుత్వ దవాఖానాల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఇక్కడ అందుతున్న సేవలు, వసతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం వేములవాడ మండలం హన్మాజీపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
తుపాన్ నష్టంపై నివేదికలు రూపొందించండి
సిరిసిల్లకల్చరల్: తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన నష్టంపై నివేదిక రూపొందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. దెబ్బతిన్న ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు, పంట నష్టంపై వ్యవసాయాధికారులు, రోడ్లు, వంతెనలు, కల్వర్టులపై రహదారులు, భవనాల శాఖ అధికారులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టల్ భవనాల లీకేజీలపై విద్యాధికారులు, చెరువులు, ప్రాజెక్టులపై ఇరిగేషన్, విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్లలో జరిగిన నష్టం అంచనాలను సెస్ అధికారులు నివేదికలు తయారు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు గడ్డం నగేశ్, వేములవాడ, సిరిసిల్ల ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వర్లు, ఈఈ నరసింహాచారి, డీఏవో అఫ్జల్‌బేగం, ఇరిగేషన్ ఈఈ కిశోర్‌కుమార్, సెస్ ఎండీ భిక్షపతి పాల్గొన్నారు.
మైనింగ్ అనుమతులపై అభ్యంతరాలు తెలపండి
జిల్లాలో మైనింగ్, క్వారీ, లీజుల మంజూరుకు, పాతక్వారీల రెన్యూవల్‌కు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఇన్‌చార్జి కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రూపొందించిన నివేది కను ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూడు వారాల్లోపు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.


