
కేసుల పరిష్కార శాతం పెంచాలి
● ఎస్పీ మహేశ్ బి గితే
సిరిసిల్ల క్రైం: జిల్లాలో కేసుల పరిష్కార శాతం పెంచే దిశగా ప్రతీ పోలీస్ అధికారి దర్యాప్తు నాణ్యతను మెరుగుపర్చాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. గురువారం వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్‌కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, చార్జిషీట్ల పురోగతిని సమీక్షించారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేయాలన్నారు. ర్యాష్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిరంతర తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచి బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ఆర్‌ఐలు మధూకర్, రమేశ్, యాదగిరి, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు