
యూరియా ప్రైవేటు దోపిడీ
● అధిక ధరలకు యూరియా ● అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు ● ఆందోళనలో అన్నదాతలు
‘వేములవాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు మంగళవారం యూరియా బస్తాలు కొనుగోలు చేసేందుకు వేములవాడ పట్టణానికి వచ్చాడు. ప్రైవేట్ వ్యాపారి వద్దకు వెళ్లగా రూ.300లకు ఒక్కో బస్తా చొప్పున విక్రయించాడు. ప్రభుత్వం రూ.266.50 విక్రయిస్తుండగా అక్కడ సరిపోయేంత దొరక్కపోవడంతో ప్రైవేట్ వ్యాపారిని ఆశ్రయించాడు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారి ధరలు పెంచడంతో చేసేదేమి లేక వ్యాపారి చెప్పినంత ఇచ్చి యూరియా బస్తాలు తీసుకెళ్లాడు.’
వేములవాడరూరల్: యూరియా కొరత.. రైతుల అవసరాన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశం ఉన్నప్పుడు దండుకోవాలన్న దుర్బుద్ధితో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సొసైటీలు, ఐకేపీ సెంటర్లలో యూరియా కొరత ఉండడంతో వ్యాపారి చెప్పినంత చెల్లించి యూరియా బస్తాలు తీసుకెళ్తున్నారు. ఓ వైపు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నా వ్యాపారులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. యూరియా బస్తాను రూ.266.50లకు విక్రయించాల్సి ఉండగా రూ.300 తీసుకుంటుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు డీలర్ల కొంటున్నామని పలువురు వాపోయారు.
రశీదులు ఉండవు
ప్రైవేటు డీలర్లు యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తుండడంతోపాటు రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. రశీదుల గురించి అడిగితే రశీదులు ఇవ్వమంటున్నట్లు తెలిసింది. ఒక యూరియా బస్తా కావాలంటే రూ.225 పెట్టి నానో యూరియా బాటిల్ కొనాల్సిందే. లేకుంటే యూరియా బస్తా ఇవ్వడం లేదని పలువురు రైతులు తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా సరఫరా
జిల్లాలో 26 కేంద్రాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తున్నారు. సిరిసిల్లలో 1, తంగళ్లపల్లి 2, ఇల్లంతకుంట 2, గంభీరావుపేట 2, ముస్తాబాద్ 2, ఎల్లారెడ్డిపేట 2, వీర్నపల్లి 2, వేములవాడ 1, వేములవాడరూరల్ 2, కోనరావుపేట 3, చందుర్తి 2, రుద్రంగి 2, బోయినపల్లిలో 2 కేంద్రాల్లో యూరియా బస్తాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియాను విక్రయించాలి. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. యూరియా బస్తాతోపాటు నానో యూరియా కొనుగోలు చేయాలని నిబంధనలు లేవు. రైతులు ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాకు 14,700 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది.
– అప్జల్ బేగం, జిల్లా వ్యవసాయాధికారి