
సులభ పద్ధతిలో బోధించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని అప్పుడే పట్టు సాధిస్తారని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, హిందీ పాఠాలను బోధించారు. గదుల్లోకి దోమలు, పురుగులు, పాములు రాకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. పోతిరెడ్డిపల్లిలో 25 మంది విద్యార్థులుండగా.. మరో విద్యావలంటీర్‌ను నియమించాలని ఆదేశించారు. కిచెన్‌షెడ్ నిర్మించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. గ్రామంలో వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తేవాలని, గ్రీన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని త ఎలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ సృజన, ఏఎంసీ చైర్‌పర్సన్‌లు కొమిరిశెట్టి విజయ, సాబేర బేగం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్ పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్‌లు, విద్యుత్ పరికరాలను పరిశీలించారు. వర్షాలు తగ్గే వరకు రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆర్థికసాయం అందజేత
గంభీరావుపేట: మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహంలో గల్లంతైన నాగయ్య కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఆర్థికసాయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం అందించారు. నాగయ్య ఆచూకీ కోసం అధికారులు మానేరు పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరదలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. లింగన్నపేటకు చెందిన గడ్డమీది మణేమ్మకు రూ.లక్ష, ప్రవీణ్‌గౌడ్‌కు రూ. 50వేల చొప్పున చెక్కులను అందించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, మండలశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్, నాయకులు అంజిరెడ్డి, తిరుపతి, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.