
‘నానో’య్ వచ్చేసింది
● మార్కెట్‌లోకి ద్రవరూప ఎరువులు ● ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ
చందుర్తి(వేములవాడ): తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి లక్ష్యంగా పలు కంపెనీలో నానో(ద్రవరూప) ఎరువులను మార్కెట్‌లో తీసుకొచ్చాయి. రెండేళ్ల క్రితమే ఇఫ్కో నానో యూరియాను తీసుకురాగా.. మిగతా కంపెనీలు సైతం అదే బాటలో నడిచాయి. తాజాగా నానో డీఎపీ సైతం అందుబాటులోకి వచ్చింది. వీటితో ఎరువుల వినియోగం మరింత సులభంకానుంది. ప్రస్తుతం 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉండగా, నానో డీఏపీ ధర అర లీటరుకు రూ.600లకు విక్రయించనున్నారు. యూరియా బస్తా ధర రూ.266 ఉండగా నానో యూరియా ధర అర లీటరు రూ.240 ఉంది. ఇప్ప టి వరకు బస్తాలో ఉండే డీఏపీ ఎరువును వరినాటు వేసే సమయంలో పొలం మొత్తం చల్లేవారు. కానీ నానో డీఏపీతో ఈ సమస్య ఉండదు. అందుకే రైతులు వీటి వినియోగంపై దృష్టి పెడుతున్నారు.
రవాణా, కూలీల ఖర్చులు ఆదా
యూరియా బస్తాపై అంతర్జాతీయ ధర రూ.2,450 ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ.2,183.50 రాయితీ ఇస్తోంది. రాయితీ పోను రైతుకు బస్తా రూ.266లకే లభిస్తుంది. ఇప్పుడు రూ.240లకే 500మి.లీ నానో యూరియా సీసా మార్కెట్‌లో లభిస్తోంది. దీంతో రైతుకు ఒక్క బాటిల్‌పై రూ.26 ఆదా అవుతుంది. డీఏపీ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.4,073 ఉండగా కేంద్రం రూ.2,501 రాయితీ భరిస్తుండడంతో రైతుకు రూ.1350లకు లభిస్తుంది. నానో డీఏపీ అర లీటరు రూ.600. ఒక్క డీఏపీ బస్తా ఎంత విస్తీర్ణానికి వినియోగిస్తామో.. అర లీటరు నానో డీఏపీ అంతే విస్తీర్ణానికి సరిపోతుండడంతో రైతుకు ఒక్క బాటిల్‌పై రూ.750 భారంతోపాటు రవాణా ఖర్చులు కలిసొస్తున్నాయి. ద్రవరూప ఎరువులను నిల్వ చేసుకోవడం కూడా చాలా సులవు. దీన్ని పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ కలుగకుండా ఉత్పత్తి చేయవచ్చు.
నానో ఎరువుల ప్రయోజనం
ద్రవరూప ఎరువులు చిన్న పరిమాణంలో కలిగి ఉండడం ద్వారా పంటకు 80 శాతం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల నత్రజని అవసరాన్ని సమర్థంగా తీరుస్తూ ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియను పెంచుతుంది. వేళ్లలో కణజాలాన్ని వృద్ధి చేస్తుంది. ఉపయోగకరమైన పిలుకలను, శాఖలను పెంచుతుంది. మొక్కల్లో నత్రజని, ఇతర పోషకాలను తీసుకునేందుకు సమీకరించటానికి మార్గాలను ప్రేరేపిస్తుంది.
ఉపయోగించే విధానం
నీటి సమరూపంలో కలిపిన 4 శాతం నత్రజని కలిగి ఉంటుంది. నానో యూరియాలో ఉన్న నత్రజని మొక్కల లోపలి నీటిలో కలిసిన తురవాత అమ్మోనికల్, నైట్రేట్ ద్రవరూపంలోకి మారుతుంది. లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు లేదా 4 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకుని పంట పెరుగుదల దశలో ఆకులపై పిచికారీ చేయాలి. ఉత్తమ ఫలితాలు కోసం మొదటి పిచికారీ పిలకదశ, పెరుగుదల దశలో, తర్వాత 20–25 రోజులకు అంటే పూతదశలో రెండో పిచికారీ చేయాలి.