
భరోసా లేదు..
పథకాలకు దూరం
సిరిసిల్ల అర్బన్: జీవనోపాధి కోసం ఉన్న ఊరిలోనే ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న కౌలురైతులను పట్టించుకునే వారు కరువయ్యారు. బ్యాంకులు ఎలాగు గుర్తించకపోగా.. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడికి డబ్బులు లేక, పంట నష్టపోతే పరిహారం రాక, బీమా భరోసా లేక కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా కౌలురైతులకు మాత్రం అందడం లేదు. ఫలితంగా వారు ఆర్థికంగా కుంగిపోతున్నారు. అప్పుల్లోకి నెట్టివేయబడుతున్నారు.
జిల్లాలో 30వేల మంది
కౌలురైతులు జిల్లాలో సుమారు 30 వేల మంది వరకు ఉంటారని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు గుర్తింపుకార్డులను అందజేసింది. అప్పటి నిబంధనల ప్రకారం కౌలురైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు అందజేసి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనేది లక్ష్యం. కానీ ప్రభుత్వం, అధికారులు ఈ విషయంలో దృష్టి సారించకపోవడంతో వారు ఎలాంటి సహకారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో ఒక ఎకరానికి సుమారు రూ.9వేల నుంచి రూ.12వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. పంట దిగుబడితో సంబంధం లేకుండా భూమి యజమానికి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి. మరో వైపు మద్దతు ధర లేకపోవడం వంటి ఇబ్బందులతో కౌలుదారులు నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి సైతం రాక అప్పులపాలవుతున్నారు.
అందని ప్రభుత్వ పథకాలు
రుణాల కోసం తిప్పలు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
ఈ ఫొటోలోని కౌలు రైతు పేరు పోచవేని శేఖర్‌యాదవ్. ఊరు రగుడు. ఐదేళ్లుగా ఆరెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మొదట్లో ఎకరాకు రూ.7వేలు కౌలు చెల్లించాడు. ఇప్పుడు రూ.10వేలకు పెరిగింది. ఎరువుల ధరలు కూడా పెరిగాయి. అయితే కౌలుకు చేస్తే లాభమేమోగాని పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని, కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నాడు. రైతు భరోసా, రైతు బీమా తదితర పథకా లు వర్తింపజేయాలని వేడుకుంటున్నారు.
కౌలురైతులకు అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రవేశపెట్టే ఏ సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం రైతుభరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలులో మాత్రం పెట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిండా మునుగుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి బ్యాంకు రుణాలతోపాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరుతున్నారు.

భరోసా లేదు..