
ఏరు పారలె.. ప్రాజెక్టు నిండలె
● మిడ్‌మానేరు కుడికాల్వ నీటి కోసం రైతుల ఎదురుచూపులు ● నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన
బోయినపల్లి(చొప్పదండి): వానాకాలం ఆరంభంలోనే సాగు నీటికోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నీటి విడుదల కోసం కుడికాల్వ కింద సేద్యం చేసే రైతులు ఎదురుచూస్తున్నారు. కుడికాల్వ నీటి ద్వారా ఇల్లంతకుంట మండ ల రైతులు పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం వా నాకాలం సీజన్‌లో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, నారెడ్డిపల్లి, రంగంపేట, నర్సక్కపేట, జవహర్‌పేట, గాలిపెల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 1,200 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
నీరు విడుదల చేస్తారనే ఆశతో..
మిడ్‌మానేరు కుడి కాల్వ ద్వారా నీరు అందుతుందనే ఆశతో ఇల్లంతకుంట మండలంలోని రైతులు పెద్ద మొత్తంలో వరి నారు పోసుకున్నారు. కాగా, ప్రస్తుతం నారుమడులు ఎండిపోయే దశలో ఉన్నాయని ఆందోళన బాట పట్టారు. కుడికాల్వ ద్వారా మిడ్‌మానేరు నీటిని విడుదల చేయాలని ఇటీవల పొత్తూర్ బ్రిడ్జి వద్ద ధర్నా చేపట్టారు. అయితే, మిడ్‌మానేరు నుంచి కుడికాల్వకు నీరు విడుదల చేస్తే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు నీరు చేరేంత ఫ్లో లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగితే కుడికాల్వకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టు 14 నుంచి 21వ తేదీ వరకు కుడికాల్వకు నీరు విడుదల చేసినట్లు అధికారులు వివరించారు.
మానేరులోకి చేరని వరద
మిడ్‌మానేరు ప్రాజెక్టు కుడి, ఎడమకాల్వల ద్వారా రైతుల పొలాలకు, ప్రాజెక్టు గేట్ల ద్వారా కరీంనగర్ ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేస్తారు. కుడికాల్వ ద్వారా ఇల్లంతకుంట మండల రైతులకు, ఎడమకాలువ ద్వారా బోయినపల్లి, కొత్తపల్లి మండల రైతులకు సాగునీరు అందిస్తారు. ఎడమకాలువ సరిగా లేకపోవడంతో నీటిని విడుదల చేయడం లేదు. మిడ్‌మానేరు అప్రోచ్ కెనాల్ ద్వారా అన్నపూర్ణ ప్రాజెక్టుకు గతంలో నీరు విడుదల చేసేవారు. కొద్దినెలలుగా మిడ్‌మానేరులో ఆశించిన నీరు లేక ప్రాజెక్టు నుంచి కుడికాల్వకు, ఇతరత్రా ఎక్కడికి నీరు విడుదల చేయడం లేదు.
ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ఆధారం
మిడ్‌మానేరులో ప్రస్తుతం 7 టీఎంసీల నీ రు నిల్వ ఉంది. నీటిమట్టం తక్కువగా ఉన్న క్రమంలో ప్రా జెక్టు నుంచి నీరు విడుదల చేసే వీలు లేదు. ప్రాజెక్టులో సుమారు 10 టీఎంసీలకు పైగా నీరు చేరితేనే విడుదల చేసే అవకాశముందని అధికారులు అంటున్నారు. గతేడాది జూలై 28 నుంచి ఎల్లంపల్లి నీరు మిడ్‌మానేరుకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 9.967 టీఎంసీల మేర మా త్రమే నీరు నిల్వ ఉంది. దీంతో అక్కడి నుంచి నీరు విడుదల చేసే వీలు లేదు. ఎస్సారెస్పీలో సైతం కేవలం 22.734 టీఎంసీలు మాత్రమే నీరు ఉండడంతో అక్కడి నుంచి కూడా విడుదల చే యడం కుదరదని అధికారులు అంటున్నారు. జిల్లాలోని మానే రు, మూలవాగు, నక్కవాగు, ఆవునూర్‌వాగుల నుంచి మిడ్‌మానేరుకు వరద రావాల్సి ఉంది.