
కోడెలను మంచిగా చూసుకోవాలి
వేములవాడఅర్బన్: రాజన్న గోశాల నుంచి తీసుకున్న కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని మంచిగా చూసుకోవాలని రైతులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ రాజన్న గోశాలలోని 85 జతల కోడెలు మొత్తం 170 కోడెలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోశాల నుంచి తీసుకున్న కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. వాటిని పక్కదారి పట్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని పేర్కొన్నారు. కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలన్నారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా గోశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో రాధాబాయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
రైతులకు 85 జతల రాజన్న కోడెల అందజేత