
బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి
సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు విధిస్తూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు. యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలస్వామి మాట్లాడుతూ, బీడీ కార్మికులను కంపెనీ యాజమాన్యాలు అనేక రకాల దోపిడీలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని బీడీ కార్మికులందరూ సమస్యలపై ఐక్యంగా పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షుడు మూషం రమేశ్, సహాయ కార్యదర్శులు సూరం పద్మ, గురజాల శ్రీధర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్‌కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల, నాయకులు శ్రీరాముల రమేశ్‌చంద్ర, నక్క దేవదాస్, జిందం కమలాకర్, దాసరి రూప, బెజుగం సురేశ్, బోనాల లక్ష్మి, లింగంపల్లి జ్యోతి, గురజాల మమత పాల్గొన్నారు.