
రేషన్‌కార్డుల కల.. నెరవేరిన వేళ
● 14వేల నూతన రేషన్‌కార్డుల పంపిణీ ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లఅర్బన్: రేషన్‌కార్డుల కోసం పేదల ఎదురుచూపులు ఫలించాయి. సిరిసిల్ల పట్టణ పరిధి లోని చంద్రంపేట రైతువేదికలో మున్సిపల్ పరి ధిలోని లబ్ధిదారులకు సోమవారం నూతన రేషన్‌కార్డులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పంపిణీ చేశారు. ప్రతీ లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నూతన రేషన్‌కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. పట్టణంలో అర్హులైన 2,610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో 4,527 మందిని అదనంగా చేర్చామని వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 21 వేల రేషన్‌కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నట్లు వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపరెడ్డి, గడ్డం నర్సయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీఎం రజిత పాల్గొన్నారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలోని 17 గ్రామాల లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన 329 మందికి రేషన్ కార్డులు జారీ చేయగా, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 975 మందిని అదనంగా చేర్చామని కలెక్టర్ వివరించారు. ఆధార్‌కార్డు, కరెంట్ కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్‌కార్డు కీలకమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్, డీఎం సివిల్ సప్లయ్ రజిత, తహసీల్దార్ ముక్తార్ పాషా, ఎంపీడీవో బీరయ్య, ఆర్‌ఐ శివకుమార్, మండల వ్యవసాయాధికారి జయ పాల్గొన్నారు.