
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కలేనా?
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాధనంతో నిర్మించిన కూరగాయలు, చేపల మార్కెట్లు వృథాగా ఉంటుండగా.. వ్యాపారులు రోడ్డుపైనే విక్రయాలు జరుపుతున్నారు. ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండగా.. ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ నిర్మించాలనే డిమాండ్ వస్తోంది. ఐదేళ్ల క్రితం ముస్తాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలన్న ఆలోచనకు ఫుల్‌స్టాప్ పడింది.
నిర్మించారు.. వదిలేశారు
ముస్తాబాద్‌లో కూరగాయల మార్కెట్ కోసం 2011లో జెడ్పీటీసీ మేర్గు యాదగిరిగౌడ్ బీఆర్జీ నిధుల ద్వారా షెడ్డును నిర్మించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆ షెడ్డులో ఒక్క రోజు కూడా మార్కెట్ నిర్వహించలేదు. షెడ్డు సరిపోదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో షెడ్డు వృథాగానే ఉండిపోయింది. అదే సంవత్సరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూ.10లక్షలతో చేపల మార్కెట్ నిర్మించి ప్రారంభించారు. చేపల మార్కెట్ కూడా ఖాళీగా ఉంది. మత్స్యకారులు చేపలను రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. దీంతో చేపల మార్కెట్ తెరుచుకోలేదు. పదిహేనేళ్లుగా చేపలమార్కెట్, కూరగాయల మార్కెట్‌లోకి ఎవరూ వెళ్లడం లేదు. మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. చేపలమార్కెట్‌లో లైట్లు, పైపులను దొంగలు ఎత్తుకెళ్లారు. అసాంఘిక కార్యకలాపాలకు రేకులషెడ్డు నిలయంగా మారింది.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు పరిష్కారం ఇదీ..
ముస్తాబాద్‌లో ప్రస్తు తం ఉన్న చేపల మార్కెట్, కూరగాయలషెడ్డును తొలగించి ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీ ప్లస్ టు విధానంలో కూరగాయలకు, చేపలు, చికెన్, మాంసం విక్రయాలకు ఒక్కో ఫ్లోర్ నిర్మించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వృథాగా కూరగాయల మార్కెట్
తెరుచుకోని చేపల మార్కెట్
ఆరుబయటే కూరగాయల విక్రయాలు

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కలేనా?