
రూ.3.44 కోట్లతో భీమన్నగుడి అభివృద్ధి
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరాలయంలో రూ.3.44 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆదివారం విప్ ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నెల రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టామని, నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
వేములవాడరూరల్: మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్కవాగుపై రూ.11.55 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి, కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన మర్రిపల్లి బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. నక్కవాగుపై, మర్రిపల్లిలో బ్రిడ్జిల నిర్మాణం, వేములవాడ రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధి, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇలా పదేళ్లుగా పడావుపడ్డ పనులను నేడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని వివరించారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుంటే, తాము ప్రజాసేవలో అభివృద్ధికి చిహ్నంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమలు చేసే ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రతీ గ్రామానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వకుళాభరణం శ్రీనివాస్, చెన్నాడి గోవర్ధన్, సోయినేని కరుణాకర్, మల్లేశం తదితరులు ఉన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్