
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సత్తాచాటుదామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాకుండా, గ్రామీణ ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సర్కార్ మూడునెలల రేషన్ బియ్యం ముందే ఇచ్చిందని వివరించారు. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగే పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మ్యాన రాంప్రసాద్, దశరథరెడ్డి, ఆడెపు రవీందర్, బర్కం నవీన్‌యాదవ్, రేగుల మల్లికార్జున్, సత్తయ్య, పొన్నాల తిరుపతిరెడ్డి, దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.