
నిందితులకు శిక్ష పడాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి శిక్ష పడేలా అధికారులు కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీసు ఆఫీస్‌లో అధికారులకు నిర్వహించి నేరసమీక్షలో ఎస్పీ పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న భద్రత చర్యలు, పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి వివరాలు తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన పద్ధతులు వివరించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రద్దీ గల ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, నటేశ్, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.