అవి‘నీటి’ అంతస్తులు | - | Sakshi
Sakshi News home page

అవి‘నీటి’ అంతస్తులు

Jul 17 2025 8:50 AM | Updated on Jul 17 2025 8:50 AM

అవి‘న

అవి‘నీటి’ అంతస్తులు

● ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్న అంతులేని ఆస్తులు ● ఈఎన్‌సీ మురళీధర్‌రావు జిల్లా వాసే.. ● అందరూ జిల్లాలో పనిచేసిన వారే.. ● బయటికొస్తున్న రూ.వందల కోట్లు

సిరిసిల్ల: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శాఖ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దాడుల్లో దొరుకుతున్న అధి కారులకు జిల్లాతో అనుబంధం ఉంది. కొందరు ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టుల పనుల్లో పనిచేయగా.. ఈఎన్‌సీ మురళీధర్‌రావు జిల్లా వాసే. ఏసీబీ దాడుల్లో భారీగా ఆస్తులు వెలుగుచూస్తున్న ఉన్నతాధికా రులందరూ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు వెలుగుచూస్తోంది. వీరి భారీ అవినీతిపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

భారీ నిర్మాణాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మధ్యమానేరు, ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద అన్నపూర్ణ జలాశయం, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద రిజర్వాయర్‌ పనులు చేపట్టారు. సిరిసిల్ల నుంచి మల్కపేట జలాశయం వరకు సొరంగం పనులు, సర్జిపూల్స్‌, కెనాల్స్‌ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల్లో అవినీతి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాల్లో పట్టుబడుతున్న ఆస్తులను చూసి వారే నివ్వెరపోతున్నారు.

మురళీధర్‌రావు మన జిల్లా వాసి

నీటిపారుదలశాఖలో చీఫ్‌ ఇంజినీర్‌గా రిటైర్డు అయిన తరువాత.. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీగా పనిచేసిన చీటి మురళీధర్‌రావు స్వస్థలం కోనరావుపేట మండలం కొండాపూర్‌. నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన మురళీధర్‌రావు అంచెలంచెలుగా ఎదిగి సీఈగా రాష్ట్రస్థాయిలో పనిచేసి రిటైర్డు అయ్యారు. ఆయన తండ్రి గోవిందరావు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డు అయ్యారు. జిల్లాలోని మెట్టప్రాంతాలను సస్యశ్యామం చేసే కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులను, 10, 11, 12వ ప్యాకేజీ పనులను పూర్తి చేయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎదుట పలుమార్లు హాజరయ్యారు. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు, ఇతర అంశాలపై ‘తెలియదు.. గుర్తు లేదనే’ సమాధానాలు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళీధర్‌రావు సోదరులు నివసిస్తున్న కరీంనగర్‌లోని వారి ఇళ్లలోనూ సోదాలు చేయడం గమనార్హం.

ఒక్కొక్కరుగా జైలుకు..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన మరో ఈఎన్‌సీ హరిరాం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అంతకుముందే ఈ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీధర్‌ ఇళ్లలోనూ సోదాలు చేసి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. మరో ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు పలుమార్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా ఉన్న ఇంజినీర్లను జైలుకు పంపించగా... రిటైర్డు అయిన అధికారులపైనా నిఘా ఉంచినట్లు తెలిసింది.

రూ.400కోట్లకు పైగానే..

ఏసీబీ దాడుల్లో దొరికిన ఇరిగేషన్‌ అధికారుల ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఖరీదైన విల్లాలు, బంగారు నగలు, నగదు అన్ని కలిపి రూ.400కోట్లకు పైగానే అక్రమంగా కూడబెట్టినట్లు తెలుస్తోంది.

జలాశయాలు వెలవెల

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన జలాశయాలు నేడు నీరు లేక వెలవెలబోతున్నాయి. 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన మధ్యమానేరులో ప్రస్తుతం 5 టీఎంసీల నీరుంది. ఇల్లంతకుంటలోని అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం అర టీఎంసీ మాత్రమే నీరు ఉంది. 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లోనూ 0.5 టీఎంసీ మాత్రమే నీరు ఉంది. ఇలా గోదావరి జలాలు జిల్లాకు పంపింగ్‌ ద్వారా రాకపోవడంతో జలాశయాలు బోసిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రైతుల సంగతి ఎలా ఉన్నా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అలుగుదుంకి పారినట్లు తాజాగా ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడుతున్న ఆస్తులే వెల్లడిస్తున్నాయి.

సిరిసిల్ల వద్ద మధ్యమానేరు బ్యాక్‌ వాటర్‌(ఫైల్‌)

అవి‘నీటి’ అంతస్తులు1
1/4

అవి‘నీటి’ అంతస్తులు

అవి‘నీటి’ అంతస్తులు2
2/4

అవి‘నీటి’ అంతస్తులు

అవి‘నీటి’ అంతస్తులు3
3/4

అవి‘నీటి’ అంతస్తులు

అవి‘నీటి’ అంతస్తులు4
4/4

అవి‘నీటి’ అంతస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement