
సర్కార్ బడిలో 450 మంది
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వందలాది మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇరవై ఏళ్ల క్రితం జెడ్పీ బాలుర పాఠశాల నుంచి ప్రత్యేకంగా బాలికల పాఠశాలగా ప్రభుత్వం మంజూరు చేసింది. బాలికల పాఠశాలను సక్సెస్ స్కూల్‌గా గుర్తించడంతో ప్రవేశాలు పెరిగాయి. అదే సమయంలో బాలుర పాఠశాలలో సంఖ్య తగ్గిపోయింది. ఒకే ఆవరణలో రెండు స్కూళ్లు ఉండడంతో తరచూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజు లుగా రెండు స్కూళ్లను కలపాలని స్థానికులు కోరుతూ వచ్చారు. బాలుర పాఠశాలలో పదేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో అధికారులు రెండు పాఠశాలలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల పాఠశాల హెచ్‌ఎం రవీందర్‌ను పెద్దూరుకు బదిలీ చేయగా, బాలుర పాఠశాల హెచ్‌ఎం, ఎంఈవో రాజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మొదటి రోజు బుధవారం 450 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో సందడిగా మారింది.