
అమ్ముడుపోతున్న ఆధునిక మగ్గాలు
సిరిసిల్ల: రాష్ట్రంలోని తొలి టెక్స్‌టైల్ పార్క్‌లో ఆధునిక మరమగ్గాలు అమ్ముడుపోతున్నాయి. బహిరంగ వస్త్ర మార్కెట్‌తో పోటీపడలేక.. వస్త్రపరిశ్రమ యూనిట్‌లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్‌ను అగ్గువకే అమ్మేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు లేక.. మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వకపోవడంతో వస్త్రోత్పత్తిదారులు ఆధునిక మగ్గాలను వడ్డికి పావుశేరు అమ్ముకుంటున్నారు. ఒక్కో లూమ్ ధర మార్కెట్‌లో రూ.5 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.40 లక్షలకు అమ్ముకుంటున్నారు. చిన్నతరహా వస్త్రపరిశ్రమలకు తమిళనాడులో మంచి ప్రోత్సాహకాలు ఉండడంతో సిరిసిల్ల ర్యాపియర్ లూమ్స్‌ను తమిళనాడు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. సిరిసిల్ల వస్త్రశ్రమకు ఆధునిక మగ్గాలకు అందించి ఆధునీకరించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలోనే సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్క్‌ను రెండు దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు. 220 యూనిట్లలో 7వేల మంది కార్మికులకు పని కల్పించాల్సి ఉండగా.. మొన్నటి వరకు 111 పరిశ్రమలు నడిచేవి. ప్రస్తుతం 52 యూనిట్లకు తగ్గిపోయి.. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో సర్కారు చేయూత లేక టెక్స్‌టైల్ పార్క్‌లోని యూనిట్లను తెగనమ్ముకుని ఇతర వ్యాపారాల్లోకి వస్త్రోత్పత్తిదారులు షిఫ్ట్ అవుతున్నారు. బొద్దుల వేణు అనే వ్యాపారి 20 ర్యాపియర్ లూమ్స్‌ను అమ్మేసి, మహబూబాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిని నెలకొల్పినట్లు సమాచారం. ఆ లూమ్స్‌ను ట్రాక్టర్‌లో సిరిసిల్ల వరకు తరలించి అక్కడి నుంచి భారీ లారీల్లో తమిళనాడుకు తీసుకెళ్తున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన ఆధునిక మగ్గాలను వస్త్రోత్పత్తిదారులు అమ్ముకోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది.
మహిళాశక్తి చీరల ఆర్డర్లు లేక..
తమిళనాడుకు సిరిసిల్ల లూమ్స్
సర్కారు చేయూత కరువై విక్రయానికి ర్యాపియర్ లూమ్స్