కందుకూరు: ‘ జనరల్ కేటగిరికి రిజర్వ్ అయినా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో పోరాడేందుకు ముందుకు వచ్చి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశాను, అయితే మా లాంటి బలహీనవర్గానికి చెందిన అభ్యర్థిపై కూడా గెలిచేందుకు అధికార పార్టీ అంత అరాచకానికి పాల్పడుతుందని ఊహించలేద’ని వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు, ఆయన సతీమణి వసంతలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఓడినా, గెలిచినా ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొందామనే ఆలోచనతో, భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిగా ఉంటుందనే భావనతోనే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగామన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని, ప్రజల స్పందన చూసిన తరువాత ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఏర్పడిందన్నారు. కానీ గురువారం జరిగిన ఎన్నికలు జరిగిన తీరు చూస్తే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేసుకోవడం చూస్తే అధికార పార్టీని ఓటమి భయం ఎంతలా వెంటాడిందో అర్థమవుతుందన్నారు. స్వయంగా మేము అనేక బూతుల్లో రిగ్గింగ్ చేస్తున్న వారిని, దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని బయటకు లాక్కొచ్చామని, అధికార పార్టీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసుకొని, రిగ్గింగ్‌కు పాల్పడి ఇప్పుడు విజయం సాధించినా..మీరు ఏ విధంగా గెలిచారో అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిపై గెలవడానికి ఇంతటి దారుణానికి పాల్పడాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా పోటీ చేసి టీడీపీ చేసిన అరాచకానికి బలైయ్యారని వివరించారు.
ఇటువంటి దారుణమైన ఎన్నికలు పెట్టకపోతేనేమి
ఏకపక్షంగా గెలిచినట్లు ప్రకటించుకోవచ్చుగా
ఎన్నికల్లో మీరు గెలిచిన తీరు చరిత్రలో
నిలిచిపోతుంది
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు, సతీమణి వసంతలక్ష్మి


