కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటా.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి ముండ్లమూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం
ముండ్లమూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి ప్రతి స్థానంలో విజయమే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచించారు. మండలంలోని తాళ్లూరు రోడ్డులో పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం సీఈసీ మెంబర్, తాజా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పలు పదవులు పొందిన వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా భారీగా వైఎస్సార్ సీపీ శ్రేణులు హాజరయ్యారు. బూచేపల్లికి మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మలు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. మీరంతా నా కుటుంబమని, నా కుటుంబంలో వాళ్లని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుత కూటమి పార్టీకి వివిధ పార్టీలతో పాటు మీడియా సంస్థలు కూడా ఉన్నాయన్నారు. వాటి ద్వారా లేని దానిని ఉన్నట్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలు, సూపర్‌సిక్స్ పథకాలను గాలికి వదిలేసి, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దోచి పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. కూటమి పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎలా తప్పుడు హామీలతో గద్దెనెక్కిందో ప్రజలకు వివరించాలన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల వద్దకు వలంటీర్ల ద్వారా సేవలు అందించిన ప్రజా నాయకుడు కావాలో? మోసం చేసి వెన్నుపోటు పొడుస్తున్న నాయకుడు కావాలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. మళ్లీ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే స్థానిక సంస్థలే పునాది అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పింఛన్ల నాటకం ఆడారని, దరఖాస్తులు ఇచ్చినా ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడకుండా శాంతియుతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి పోటీ చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, మాజీ జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సూదిదేవర అంజయ్య, రైతు విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, డగ్లస్, రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.


