స్కూల్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

తౌషిక్‌ను హత్య చేసి మౌలాబీ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి హత్య కేసును నీరుగార్చిన ఎస్సై, సీఐ, డీఎస్పీని సస్పెండ్‌ చేయాలి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపన అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ భారీగా మొహరించి మహాధర్నాను అడ్డుకున్న పోలీసులు

ఒంగోలువన్‌టౌన్‌: సింగరాయకొండలోని నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థి తౌషిక్‌ను హత్య చేసిన ఆ స్కూల్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. తౌషిక్‌ హత్య, అతని తల్లి మౌలాబీ ఆత్మహత్యలకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ప్రజాసంఘాలు తలపెట్టిన మహాధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. భారీగా మొహరించి ఒంగోలు క్లౌపేట 3వ లైన్‌ వద్ద నుంచి చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణమాదిగ మాట్లాడుతూ.. అన్ని వైపులను పోలీసులు దిగ్బంధించారని, బ్యారికేడ్లు, మూడంచెల భద్రత పేరుతో ఒంగోలు వచ్చే దారుల్లో ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారని, ఇంత దిగ్బంధనం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము నిరసన చేయాలని కోరుకుంటే.. పోలీసులు మాత్రం దిగ్బంధనం చేశారన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నంలో పోలీసులే తౌషిక్‌ హత్య కేసును అనుమానాస్పదమృతి కేసుగా నమోదు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మౌలాబీ మరణ వాంగ్మూలంలో కూడా స్కూల్‌ యాజమాన్యంపైనే ఆరోపణలు చేసిందన్నారు. నిందితులకు రాజకీయ నాయకుల అండ ఉందన్నారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌ రాజాబాబుకు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. స్కూల్‌ యాజమాన్యంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒంగోలు డీఈఓను సస్పెండ్‌ చేయాలని, కేసు విచారణలో పాల్గొన్న ఎస్సై, సీఐ, డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రజాసంఘాల నాయకుల అరెస్టు...

ఒంగోలు టౌన్‌: ప్రజాసంఘాలు, ముస్లిం మైనారిటీ సంఘాలు చేపట్టిన మహాధర్నాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టరేట్‌ వరకు పోలీసులను మొహరించారు. ఆర్టీసీ బస్టాండులో నగరానికి వచ్చిన ప్రయాణికులను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిరియాలపాలెం నుంచి మొదలుకుని కోలాస్‌ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు బ్యారికేడ్లు అడ్డుపెట్టి కలెక్టరేట్‌ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ ఉద్యోగులను సైతం ఐడీ కార్డులు చూపిస్తేనే లోపలకు అనుమతించినట్లు ప్రచారం జరిగింది. మహాధర్నాలో పాల్గొనేందుకు స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. పాత మార్కెట్‌ వద్దకు రాగానే పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ చిష్టీ, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులుతో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసి చీమకుర్తి తరలించారు. అయితే ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, నగర నాయకురాలు రాజేశ్వరి పాత మార్కెట్‌ సెంటర్‌లో బైఠాయించి నినాదాలు చేశారు. తౌషిక్‌, అతడి తల్లి మౌలాబీ మరణాలకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement