ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించినందుకు అక్రమ కేసులు ఎన్‌ఆర్‌ఐను గుంటూరు జైలులో పరామర్శించిన మాజీ మంత్రి సురేష్
జరుగుమల్లి(సింగరాయకొండ): రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా 2025వ సంవత్సరంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టేందుకు ఆర్థికంగా సహకరించాడంటూ అమెరికా నుంచి అనారోగ్యంగా ఉన్న తల్లిదండ్రులను చూడటానికి వచ్చిన కొడుకు సగిలి అనిల్ కుమార్ రెడ్డిని ఈనెల 7వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయంలోనే అరెస్టు చేసి జైలుకు తరలించారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోలీసుల పనితీరును దుయ్యబట్టారు. గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న జరుగుమల్లి మండలం తూమాడు గ్రామానికి చెందిన సగిలి అనిల్‌కుమార్‌రెడ్డిని సోమవారం సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో యూరియా వాడితే కాన్సర్ వస్తుంది అన్న చంద్రబాబు వ్యాఖ్యలను సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించినందుకు చిలకలూరిపేట టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి ఇచ్చిన ఫిర్యాదుతో అనిల్‌కుమార్‌రెడ్డి తో పాటు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాకు చెందిన సాయిభార్గవ్, భరత్, తారక్‌లతో పాటు మొత్తం ఏడుగురి పై పలు సెక్షన్‌ల కింద అక్రమ కేసులు బనాయించారన్నారు. ఇప్పటికే సాయిభార్గవ్, భరత్, తారక్‌లు జైలులో శిక్ష అనుభవించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటామని వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇది ప్రజా పాలన కాదని ప్రచార పాలన అని దుయ్యబట్టారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూర్ ఫాతిమా, ఆలూరి సాంబశివారెడ్డి, మాజీ సర్పంచ్ వాసా నారాయణ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కసిరెడ్డి కోటిరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.


