యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం: స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, ఇది ఎంతో కాలం సాగదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి ఎస్‌ఎంసీ ఎన్నికల్లో అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను సోమవారం మార్కాపురం సబ్‌జైలులో ఎమ్మెల్యే చంద్రశేఖర్ కలిసి మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మంగళవారం రాజకీయాలు మళ్లీ మొదలుపెట్టారన్నారు. గెలిచినట్టు చూపించుకోవాలనే పన్నాగంతోనే ఇలాంటివి చేస్తున్నారన్నారు. చేయని తప్పులకు ఎస్‌ఎంసీ ఎన్నికల్లో పోలీసులను పిలిపించి విద్యార్థుల తల్లిదండ్రులను కొట్టించారని, ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారన్నారు. పోలీసుల వద్ద ఉన్న లాఠీలను టీడీపీ కార్యకర్తలు లాక్కుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడిచేస్తున్న విజువల్స్ స్పష్టంగా కనిపించాయని అన్నారు. ఈ విషయమై ఎస్‌పీ దృష్టికి తీసుకెళ్లామని, దీంతో త్రిపురాంతకం సీఐని వీఆర్‌కు పంపారన్నారు. ఏ తప్పు చేయని వారిని జైలుకు పంపడం అన్యాయం కాదా అన్నారు. గొల్లపల్లిలో పలువురు జీవాలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారిపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ఉన్నంపల్లికి చెందిన 9 మందిని, గొల్లపల్లికి చెందిన ఆరుగురిపై కేసులు పెట్టారన్నారు. కొడుతున్న వారిని వదిలేసి, కొట్టించుకున్న వారిపై కేసులు పెట్టారన్నారు. మహిళలపై కూడా దాడులు చేశారన్నారు. ఏనేరం చేయని వారిని జైలుకు పంపడం అన్యాయమన్నారు. గొల్లపల్లిలో పోలీసులే మహిళలని కొట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయన్నారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎస్‌ఎంసీ ఎన్నికల్లో గెలవలేకనే ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు బుద్ధిచెప్పే రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల్లో గెలవకపోతే ఇలా చేస్తారా అని సీఎంను ప్రశ్నించారు. ఈ విధంగా జైలులో పెట్టి చంపేస్తారా అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పేదలకు మంచి జరగాలన్నా, పనికిమాలిన ప్రభుత్వం పోవాలన్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డి ఉన్నారు.


