అవకతవకలు సరిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అవకతవకలు సరిచేయాలి

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

అవకతవకలు సరిచేయాలి

కందుకూరు: కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్విభజనలో జరిగిన అవకతవకలను వెంటనే సరిచేయడంతో పాటు ప్రజలందరికీ సౌలభ్యంగా ఉండే విధంగా వార్డుల విభజన చేయాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. వార్డుల పునర్విభజనలో చోటుచేసుకున్న అవకతవకలు, మున్సిపల్‌ అధికారుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. వార్డుల పునర్విభజనలో చోటుచేసుకున్న పలు అవకతవకలను మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పాత 8వ వార్డులోని ఆదియేంధ్ర కాలనీలో పూర్తిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంటారని, కాలనీలో రెండు బజార్లను తొలగించి మూడో వార్డులో భాగం చేశారని, ఇది ఐక్యంగా ఉన్న ఎస్సీలను విడదీసే కుట్రని అన్నారు. రెవెన్యూకాలనీ, కాకుమానివారిపాలెం గ్రామాలను కొత్తగా తీసుకొచ్చి కలిపి అగ్రవర్ణాలను చేర్చారన్నారు. ఎస్సీలను విభజించి దెబ్బతీయాలనే కుట్ర ఇందులో కనిపిస్తోందన్నారు. పాత 14వ వార్డులోని శ్రీరామ్‌నగర్‌ కాలనీని తొలగించారని, చుట్టుగుంట, గల్లావారిపాలెం, ముక్కోడివారిపాలెం, కండ్రావారిపాలెం వంటి గ్రామాలను కలపడం వల్ల ఆ వార్డు ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్‌ కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. శ్రీరామ్‌నగర్‌ కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎస్సీ, బీసీ కాలనీలను కలిపి ఒక వార్డు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పాత 23వ వార్డులోని బీసీలు, మైనార్టీలను విడగొట్టడం వల్ల ఆ వార్డు ఐక్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ మైనార్టీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఇటువంటి అవకతవకలు అనేకం చోటుచేసుకుంటున్నాయని, వీటిని వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వార్డుల పునర్విభజనకు ముందు కనీసం రాజకీయ పార్టీల సమావేశం కూడా నిర్వహించకుండా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్‌ సీపీకి ఎటువంటి సమాచారం ఇవ్వకండా ఏకపక్షంగా వార్డుల విభజన చేపట్టారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులను తొలగించాలి...

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ప్రారంభం నుంచే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే తొలగించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. 40 వార్డుల్లోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనివలన రిజర్వేషన్ల కేటాయింపు, బూత్‌ల ఏర్పాటు వంటి వాటిలో అనేక సమస్యలు ఉత్పత్తన్నమయ్యే అవకాశం ఉందని అన్నారు. దీనిపై అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామని, కానీ వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని అన్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ కె.అనూషను కలిసి వార్డుల విభజనలో చోటుచేసుకున్న పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల వారీగా వచ్చిన అభ్యంతరాలను ఆమెకు అందజేశారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తగిన సమాధానం ఇస్తామని ఈ సందర్బంగా కమిషనర్‌ తెలిపారు.

వార్డుల పునర్విభజనలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మున్సిపల్‌ అధికారులను తొలగించాలి

వార్డుల సరిహద్దులు ప్రజలకు అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలి

అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు కేటాయించాలి

కందుకూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

వైఎస్సార్‌ సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు...

మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిసేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదన్నారు. దీంతో పోలీసులు – వైఎస్సార్‌ సీపీ నేతల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు గణేశం గంగిరెడ్డి, ముప్పవరపు కిశోర్‌, రావులకొల్లు బ్రహ్మానందం, కాకర్ల గోపాల్‌, వల్లూరి కోటేశ్వరరావు, గేరా మనోహర్‌, యరమాల నాగభూషణం, నగళ్ల నారయ్య, ఉచ్చులూరి రవీంద్ర, తల్లపనేని గోపి, దేవిశెట్టి రాజేష్‌, పల్నాటి చెన్నయ్య, సాధు మాధవ, యడ్ల మాధవరెడ్డి, షేక్‌ మస్తాన్‌వలి, ఇజ్రాయేల్‌, కానాల శివప్రసాద్‌, కొచ్చెర్ల మాల్యాద్రి, యల్లావుల మురళి, పెయ్యల రమణయ్య, పరిశుద్ధరావు, చనమాల కోటేశ్వరరావు, శ్రీరామకుమారస్వామి, ముప్పరాజు శ్రీనివాసులు, మందలపు మహేష్‌, షేక్‌ ముజిబుల్‌ రెహమాన్‌, షేక్‌ నాయబ్‌, షేక్‌ హమీద్‌, థామస్‌, దండే రమేష్‌, హఫీజ్‌, షేక్‌ అల్లాభక్షు, ఉప్పుటూరి నాగేశ్వరరావు, షేక్‌ బాబ్జాన్‌, రావూరి శ్రీను, కొండలరావు, దేవరకొండ ఆదిలక్ష్మి, కొత్తగొల్ల వసంత, తన్నీరు ధరణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement