ప్రాణాలకు వల | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు వల

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

పాకల బీచ్‌లో అధికారుల నిర్లక్ష్యంతో బలవుతున్న ప్రాణాలు కడ్స అలల బారిన పడి ఇప్పటి వరకు 9 మంది మృతి గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఇప్పుడూ గల్లంతయ్యారంటున్న మత్స్యకారులు ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులుంచాలంటున్న పర్యాటకులు గత ఏడాది నాలుగు రోజులు, ఇప్పుడు 5 రోజులు బీచ్‌ మూసివేత తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్న అధికారులు

రాకాసి అల..

కుటుంబంతో సరదాగా గడపాలని పాకల సముద్రతీరానికి వచ్చే వారిని రాకాసి అలలు బలితీసుకుంటున్నాయి. ఇప్పటికే 9 మంది ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఒకే చోట పదే పదే ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ఆ ప్రదేశంలో కనీసం హెచ్చరిక బోర్డును కూడా అధికారులు ఏర్పాటు చేయడం లేదు. దుర్ఘటనలు జరిగినప్పుడు తాత్కాలికంగా బీచ్‌ను మూసేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు శాశ్విత ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. ఈతరాని మైరెన్‌ పోలీసుల నామమాత్రపు గస్తీతో పర్యాటకుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది.

సింగరాయకొండ:

ప్రాణాలు బలి ఇస్తే తప్ప అధికారులు భద్రతా చర్యలు చేపట్టరా అని పర్యాటకులు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. పాకల సముద్రతీరంలో కడ్స రాకాసి అల బారిన పడి ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. 2023 జనవరి 29 వ తేదీ సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పకీరు పాలేనికి చెందిన షేక్‌ అబ్దుల్‌ అమీద్‌ సిద్దిక్‌ కుమారుడు అబ్దుల్‌ అమాద్‌ (15) మృతి చెందగా, కుమార్తె అబ్దుల్‌ అమల్‌ (14)ను మత్స్యకారులు రక్షించారు. 2025వ సంవత్సరంలో నలుగురు మృతి చెందారు. తరువాత సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 16వ తేదీ పొన్నలూరు మండలం తిమ్మపాలెం పంచాయతీ శివన్నపాలెంకు చెందిన నోసిన జెస్సికా, నోసిన యామిని, కందుకూరు మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని, సింగరాయకొండ మండలం శ్రీరాంనగర్‌కు చెందిన తమ్మిశెట్టి పవన్‌కుమార్‌ మృతి చెందారు. ఇప్పుడు జరిగిన ఘటనలో కనిగిరి పట్టణానికి సమీపంలోని శ్రీ రంగాపురం ఇరిగినేని కాలనీకి చెందిన పాలడుగు తేజ(20), బత్తుల మహేష్‌బాబు (22), దేవేండ్ల విష్ణు (16), దేవేండ్ల నారాయణ (30) మృతి చెందగా బత్తుల మనోజ్‌, బండారు మహేష్‌ తేజ, బత్తుల నరశింహం ఆస్పత్రిలో చికిత్స పొంది బతికి బయటపడ్డారు. ఇక తీరంలో మత్స్యకారులు దేవేండ్ల ప్రసాద్‌, దేవేండ్ల రాజాలను రక్షించారు.

కడ్స రాకాసి అలకు పుట్టినిల్లా..

పాకల సముద్రతీరంలో వచ్చే కడ్స రాకాసి అలలకు ఇప్పుడు కొత్త సాంకేతిక పేరు రిప్‌ కరెంట్స్‌ (తీవ్రమైన సముద్ర ప్రవాహాలు) అని అధికారులు చెబుతున్నారు. ఈ రాకాసి అలలు బీచ్‌లో దక్షిణం వైపు సరివి చెట్ల సమీపంలో అధికంగా వస్తుంటాయి. 2025 జనవరిలో కడ్స రాకాసి అల బారిన పడి నలుగురు మృతి చెందిన ప్రాంతంలోనే ఇప్పుడు మళ్లీ అదే కడ్స రాకాసి అల బారిన పడి మరో నలుగురు చనిపోయారు. శనివారం సంఘటన జరిగిన తరువాత కూడా మత్స్యకారులు కడ్స అల రావటాన్ని అధికారులకు స్వయంగా చూపించారు. కానీ రాకాసి అలలు వచ్చే ఈ ప్రాంతంలో ఎటువంటి భద్రతా చర్యలు కానీ, హెచ్చరిక బోర్డులు కానీ ఏర్పాటు చేయకపోవటం దారుణమని పర్యాటకులతో పాటు మత్స్యకారులు మైరెన్‌ పోలీసుల పనితీరును విమర్శిస్తున్నారు.

ప్రాణాలు పోతే బీచ్‌ మూయాల్సిందే:

2025 జనవరి 16వ తేదీ ఘటనలో సంక్రాంతి పండుగ కావటంతో బీచ్‌లో పర్యాటకుల సందడి బాగా ఉంది. ఆ సమయంలో రాకాసి అల బారిన పడి నలుగురు చనిపోవటంతో అప్పుడు అధికారులు 4 రోజుల పాటు బీచ్‌ను మూసివేశారు. ఇప్పుడు మళ్లీ నలుగురు చనిపోవటంతో భద్రతా కారణాల రీత్యా వాతావరణ శాఖ హెచ్చరికలను ఉటంకిస్తూ మళ్లీ 5 రోజుల పాటు అనగా ఈనెల 15వ తేదీ వరకు బీచ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు అధికారులు ఆ పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించి మైరెన్‌ పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఉంటే నాలుగు నిండు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా బీచ్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టి పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించి బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement