ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా సీనియర్ మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ జట్ల ఎంపిక ఒంగోలు నగరంలోని ఏకేవీకే కళాశాలలో ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు సంబంధించి క్రీడాకారులు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందన్నారు. బరువు నిబంధనలకు సంబంధించి సీనియర్ మెన్ 85 కేజీల లోపు, సీనియర్ ఉమెన్ 75 కేజీల లోపు ఉంటుందన్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరై ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో ప్రకాశం జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 99890 97947, 81062 69456, 94916 65070 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఒంగోలు టౌన్: దేశంలోని కోట్లాది ప్రజల ఓటు హక్కును హరించడం దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను, ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పోరాటాల్లో భాగస్వాములు కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు పిలుపునిచ్చారు. ఎప్పుడో తాత ముత్తాతల వివరాలను రుజువు చేయకపోతే ఓటు హక్కు తొలగిస్తామనడం బీజేపీ పాలకుల సైకో మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సర్‌ను రద్దు చేయాలని, ఓటు హక్కును కాపాడాలని, ఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే సర్ వంటి దుర్మార్గ ప్రక్రియ ఎప్పుడూ రాలేదన్నారు. దేశ పౌరులు తమను తాము నిరూపించుకోవాల్సి రావడంకంటే విషాదం మరొకటి లేదని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా, రాజ్యాంగబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత విస్మరించిన ఈసీని తొలగించడం మంచిదన్నారు. సీపీఐ ఎంఎల్ నాయకులు ఎన్.సాయి మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం పోరాడుతున్న యువత మీద ప్రైవేటు గుండాలు దాడులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి.మోహన్ మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వం జ్ఞానేష్ కుమార్ కోసం పడుతున్న తపన వెనక ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. సీపీఎం నాయకులను అరెస్టు చేయడం పట్ల వామపక్ష పార్టీ నాయకులు ఖండించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణతోపాటు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. రిజర్వేషన్ల అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అడిషనల్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా పరిషత్ సీఈవోలు, పంచాయతీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకుండా చూసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.


