టీడీపీ ఇన్‌చార్జి చేయిస్తున్నాడు..పోలీసులు చేస్తున్నారు ఎస్‌ఎంసీలో బలంలేదనిపచ్చ గూండాల దాడి వైఎస్సార్ సీపీ వర్గీయులపై అక్రమ కేసులు నమోదు దాడికి పాల్పడిన వారితోపాటు పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: టీడీపీ ఇన్‌చార్జి పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు చేయిస్తున్నాడని, పోలీసులు అడ్డగోలుగా ఆయన చెప్పినట్లు చేస్తున్నారని దర్శి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వారు పర్యటించారు. ఈ నెల 3వ తేదీ జరిగిన గొల్లపల్లి స్కూల్ మానిటరింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ వర్గీయుల బలం లేదన్న ఉద్దేశంతో ఆ ఎన్నికలతో సంబంధంలేని నలుగురు పచ్చమూకలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులు వైఎస్సార్ సీపీ వర్గీయులపై లాఠీచార్జి చేయడంతోపాటు ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి గుమ్మా గురవయ్య, కటికి ప్రసాద్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. టీడీపీ వర్గీయులు ఆరుగురిపై కంటితుడుపు కేసులు నమోదు చేసినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ వర్గీయుల ఇళ్ల వద్దకు ఆదివారం బూచేపల్లి, తాటిపర్తి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎంసీ ఎన్నికలతో సంబంధంలేని వారిద్దరిపై సీఐ అక్రమంగా కేసులు నమోదు చేయించారని వారు ఆరోపించారు. 65 మంది వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు, 13 మంది టీడీపీ సానుభూతి పరులు ముందుగానే ఎస్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొనేందుకు పాఠశాలలోకి వెళ్లారని, తమ బలం సరిపోదని పచ్చ నాయకులు ఎన్నికలతో సంబంధంలేని నలుగురిని పంపించి దాడి చేయించారని, ఈ సంఘటన పోలీసుల ముందే జరుగుతున్నా వారు అడ్డుకోలేదని మండిపడ్డారు. టీడీపీ ఇన్‌చార్జి ఆదేశాల మేరకు ఎన్నికలు ఏదో ఒక విధంగా ఆపించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారని వారు అన్నారు. ఈ దుశ్చర్యను చూస్తూ ఊరుకోమని.. దాడి చేసిన గూండాలతోపాటు పోలీసులపై కూడా ప్రైవేటు కేసులు వేస్తామని అన్నారు. గొల్లపల్లిలో జరిగిన సంఘటన గురించి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వారు అన్నారు. నేషనల్ బీసీ కమిషన్ వద్దకు ఈ సంఘటనతోపాటు పుల్లలచెరువు మండలంలోని కుందంపల్లిలో బీసీలపై జరిగిన దాడి సంఘటనను తీసుకొని వెళ్తామని చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో గెలవలేరనే టీడీపీ నాయకుల కుట్రలు:
జగనన్నపై ఉన్న అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన గ్రామంగా నిలిచిన గొల్లపల్లిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చ పార్టీ మద్దతుదారులు గెలవలేరని వారు నిర్ధారించుకొని ఈ విధంగా కేసులుపెట్టి ధైర్యాన్ని కోల్పోయేలా చేయాలని వారు ఆలోచిస్తున్నారని, అధికారం ఉందని అహం చూపిస్తున్నారని అన్నారు. గ్రామస్తులు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని, మీకు జగనన్నతోపాటు తమ అందరి అండ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, ఎస్.రంగబాబు, ఆళ్ల కృష్ణారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, మురారి గాలయ్య, శార, రాజన్న, ఒంటేరు నాగేశ్వరరావు యాదవ్ పాల్గొన్నారు.


