మా పిల్లలు ఎలా ఉన్నారయ్యా...
● పాకల తీరంలో పెను విషాదం ● ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతుతో కన్నీటి సంద్రంగా మారిన శ్రీరంగాపురం ● సోమవారం పనులకు బయలుదేరేలోపే ప్రమాదం ● వద్దన్నా వినకుండా వెళ్లి.. మృత్యు ఒడికి ● గుండెలవిసేలా విలపిస్తున్న బాధిత కుటుంబాలు
వలస జీవులపై..
ఒకే ఇంట్లో ఇద్దరు గల్లంతు...
దేవండ్ల నారాయణ, దేవండ్ల విష్ణు ఇద్దరూ సొంత బాబాయ్ అబ్బాయ్‌లు. వీరిద్దరూ గల్లంతయ్యారు. ఇదే ప్రమాదంలో బయటపడ్డ దేవేండ్ల ప్రసాద్, విష్ణు తండ్రి . విష్ణు, నారాయణ గల్లంతు కావడంతో ఆ కుటుంబంలో ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తల్లి సంజీవమ్మ, అమ్మమ్మ చేసే రోదనలు చూపరులను కంటతడిపెట్టిస్తున్నాయి. తన బిడ్డ జాడ కోసం ఆమె విలపిస్తూనే ఉంది. అలాగే దేవండ్ల నారాయణకు ఇద్దరు కుమార్తెలు, ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
గల్లంతైన దేవండ్ల నారాయణ (ఫైల్), దేవండ్ల విష్ణు (ఫైల్)
కనిగిరి:
పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని శ్రీరంగాపురం ఇరిగినేని కాలనీలో 40కిపైగా వడ్డెర కుంటుబాలు నివాసముంటున్నాయి. వీరంతా బేల్దారీ కూలీలు. పనుల కోసం వలస వెళ్తుంటారు. ప్రధానంగా ఇంటి పనుల నిమిత్తం తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఏడాదికోసారి వినాయకచవితి పండుగ కోసం ఆగస్టు నెలలో ఎక్కడెక్కడున్న వారంతా స్వగ్రామానికి వస్తారు. ఆ తర్వాత గ్రామ దేవతలకు పొంగళ్లు, సంప్రదాయ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి అక్టోబర్‌లో పనులకు బయలుదేరతారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వీరంతా వెళ్లాలి. మహాలయ పక్షాలు రావడంతో పాటు శుక్ర, శనివారాలు అమావాస్య కావడంతో ఆగారు. ఆది, సోమవారాల్లో తిరుగు ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. కొందరు బస్సులో రిజర్వేషన్లు చేసుకోగా, మరికొందరు వాహనాల్లో ముఠాగా వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
అంతలోనే విషాదం...
సోమవారం పనులకు బయలుదేరాల్సిన వారంతా శనివారం సముద్రస్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వెళ్లేందుకు పయనమయ్యారు. ఉదయం సుమారు 9 గంటలకు టాటా ఏస్ పెద్ద ఆటో, రెండు ఆటోల్లో సంతోషంగా 70 మంది బయలుదేరారు. సుమారు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సముద్ర తీరానికి చేరుకున్నారు. మూడు బృందాలుగా చేరుకోగా, మొదటిగా వచ్చిన బ్యాచ్ దక్షిణంవైపు సముద్రంలోకి వెళ్లగా, మిగిలిన రెండు బ్యాచ్‌లు ఉత్తరం వైపు సముద్రస్నానాలు చేస్తున్నాయి. దక్షిణం వైపు సముద్ర స్నానాలు చేసేందుకు సముద్రంలోకి పాలడుగు తేజ (20), బత్తుల మహేష్‌బాబు (22), దేవేండ్ల విష్ణు (16), దేవేండ్ల నారాయణ (30), బత్తుల మనోజ్‌కుమార్ (23), బండారు మహేష్ తేజ (18), బత్తుల నరసింహం, దేవండ్ల ప్రసాద్, దేవండ్ల రాజా వెళ్లారు. అదే సమయంలో రాకాసి అల రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయారు. తీరంలో ఉన్న మత్స్యకారులు వెంటనే గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ముందుగా ఇద్దరిని కాపాడారు. బోటు వేసుకుని వెళ్లి మరో నలుగురిని తీరానికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందిన పాలడుగు తేజ మృతదేహాన్ని తీరానికి తెచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన బత్తుల మహేష్‌బాబు, బత్తుల మనోజ్, బండారు మహేష్‌తేజ, బత్తుల నరసింహంలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దారిలోనే బత్తుల మహేష్‌బాబు మృతి చెందాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ విషాద వార్త గ్రామంలో తెలిసి వారంతా ఉలిక్కిపడ్డారు. ఉదయం వరకూ తమతో సంతోషంగా గడిపి సముద్రస్నానానికి వెళ్లి ఇలా ప్రమాదానికి గురికావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి బయలు దేరారు. వృద్ధులు, కొందరు మహిళలు మాత్రమే కాలనీలో కనిపించారు. వీరంతా తమ వారి పరిస్థితి ఎలా ఉందంటూ.. ఎంతో హృదయవిదారకంగా రోదిస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్న తీరు కంటతడిపెట్టించింది.
అమావాస్య.. వెళ్లొద్దన్నా వినలేదు...
ప్రతి ఏడాది పనులకు బయలుదేరే ముందురోజు కాలనీ వాసులంతా కలిసి సరదాగా సముద్ర స్నానానికి వెళ్తారు. అదే అనవాయితీగా ఈసారి కూడా వెళ్లిన శ్రీరంగాపురం (ఇరిగినేని కాలనీ) వాసులు ఇద్దరు మృత్యుఒడికి చేరడం, మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కాకపోవడంపై ఆ గ్రామంలో కన్నీటి శోకాలు మిన్నంటాయి. అమవాస్య రోజు సముద్రస్నానం వద్దని పెద్ద చెప్పినప్పటికీ వినకుండా వెళ్లారంటూ గ్రామానికి చెందిన వెంకటమ్మ, కొండమ్మ, నారాయణమ్మ, లక్ష్మి, వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. శ్రీరంగాపురం (ఇరిగినేని కాలనీ) వడ్డెరకాలనీ వాసులంతా దాదాపు ఒకే కుటుంబానికి చెందిన వారే. ప్రతి ఇంటికి బంధుత్వం ఉంది. ప్రతి ఇంట్లోనూ కన్నీటి ఘోష వినిపిస్తోంది.
కాలనీలో ఇద్దరు మృతి...
పాలడుగు నాగేశ్వరరావు, లక్ష్మీమణి దంపతులు, వారి చిన్న కుమారుడు తేజ (20) ముగ్గురూ కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. అప్పటిదాకా తమతో ఉన్న కుమారుడు పాలడుగు తేజా మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తమ్ముడి మరణవార్త విని అన్న చక్రవర్తి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా మృతుడు తేజ తండ్రి పాలడుగు నాగేశ్వరరావు అంధుడు. ఆయనకు తోడుగా వెళ్ళి విగతజీవిగా మారాడు. ప్రమాదానికి ముందు తండ్రికి భోనం తినిపించి స్నానానికి వెళ్లాడు.
సరదాగా వెళ్లి...
మృతుడు బత్తుల మహేష్ (23) డిగ్రీ పూర్తి చేసి ఇతర కోర్సులు చదువుతూ ఉద్యోగ వేటలో ఉన్నాడు. తల్లిదండ్రుల కష్టంతో ఎంతో అందమైన ఇల్లు నిర్మించుకుని తుది మెరుగుల పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో తోటి బంధువులు, స్నేహితులు కాలనీలోని అందరూ సముద్రస్నానానికి వెళ్తుంటే వారితో సరదాగా కాసేపు గడిపి వద్దామని వెళ్లి మృత్యుఒడికి చేరాడు. దీంతో తల్లి బాలకొండమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
అయ్యా.. మీరంతా ఎవరు.. విలేకరులా.. మా వాళ్లు సముద్రంలో చిక్కుకున్నారంటగా.. ఎలా ఉన్నారయ్యా.. ఎవరికి ఇబ్బంది లేదుగా.. కొంచం చెప్పండయ్యా... అంటూ కాలనీలోని వృద్ధులు ఎంతో అమాయకంగా అడుగుతున్న తీరు హృదయాలను చలించివేసింది. కనీసం ఆస్పత్రిలో ఉన్నవారి ఫొటోలైనా చూపించండయ్యా.. అంటూ ఎంతో ఆతృతగా వృద్ధులు, మహిళలు చమర్చిన కళ్లతో అడుగుతున్న తీరు వర్ణణాతీతం.


