ఆలస్యంగా వచ్చిన 108 వాహనం సొంత వాహనంలో బాధితులను తీసుకెళ్లి మార్గమధ్యంలో 108లోకి ఎక్కించిన బంధువులు బీచ్‌లో భద్రత కరువు సివిల్ డ్రస్‌లో ఉన్న ఒకేఒక మైరెన్ కానిస్టేబుల్ తీరంలో మత్స్యకారులు లేకపోతే 9 మంది ప్రాణాలూ పోయేవంటున్న బాధిత కుటుంబాలు ప్రతిసారీ పర్యాటకులను కాపాడేది మేము.. క్రెడిట్ పొందేది మైరెన్ పోలీసులని అంటున్న మత్స్యకారులు
సింగరాయకొండ: పాకల బీచ్ ఘటనలో అక్కడ మత్స్యకారులు లేకపోయి ఉంటే గల్లంతైన 9 మంది ప్రాణాలూ పోయేవి. సమయానికి మత్స్యకారులు ఉండటం, వెంటనే స్పందించడంతో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అదేవిధంగా 108 వాహనం సమయానికి వచ్చి ఉంటే మరో ప్రాణం దక్కేదేమోనని బాధిత కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బీచ్‌లో సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరగ్గా.. 108 రాక కోసం అరగంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. 108 వాహనం ఎంతకీ రాకపోవడంతో తమ సొంత వాహనంలో బత్తుల మహేష్‌బాబు, బత్తుల మనోజ్, బండారు మహేష్‌తేజ, బత్తుల నరసింహంను తీసుకెళ్లామని, పాకల రైల్వే గేటు వద్దకు రాగానే 108 వాహనం ఎదురొచ్చిందని, వెంటనే తాము టంగుటూరు, ఉలవపాడుకు చెందిన రెండు వాహనాలలో నలుగురిని ఎక్కించామని తెలిపారు. తీరా కందుకూరు ఏరియా ఆస్పత్రికి చేరే సమయానికే బత్తుల మహేష్ బాబు చనిపోయాడని అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే మహేష్ ప్రాణాలు దక్కేవంటున్నారు.
మైరెన్ పోలీసుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్న పర్యాటకులు...
బీచ్‌లో పర్యాటకుల భద్రతను నిరంతరం పర్యవేక్షించాల్సిన మైరెన్ పోలీసులు కేవలం ఒకేఒక్కరు ఉండటం, అది కూడా సివిల్ డ్రస్‌లో ఉండటంతో పర్యాటకుల భద్రతంటే లెక్క లేదా అని మైరెన్ పోలీసుల నిర్లక్ష్యాన్ని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి రోజుల్లో రాకాసి అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు తెలియజేస్తున్నారు. అలాంటప్పుడు తీరంలో అప్రమత్తంగా ఉండాల్సిన మైరెన్ పోలీసులు ఏమయ్యారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో సుమారు 70 మంది వరకు కనిగిరి నుంచి బీచ్‌కు వచ్చారు. దీనికితోడు దసరా సెలవులు కావడంతో తీరంలో పర్యాటకుల తాకిడి బాగా ఉంది. రద్దీగా ఉన్న బీచ్‌లో కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ బందోబస్తు ఎలా నిర్వహిస్తారని మత్స్యకారులు, పర్యాటకులు నిలదీస్తున్నారు. అంతేగాకుండా తీరంలో బందోబస్తు నిర్వహించే మైరెన్ పోలీసులకు ఈత వచ్చి ఉండాలి. కానీ, చాలామంది కానిస్టేబుళ్లకు ఈత రాదని, అలాంటప్పుడు పర్యాటకులు గల్లంతైతే వారెలా కాపాడగలరని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో బోట్లను తీరానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని, వారు చెప్పినట్లు దూరంగా ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ రోజు 9 మందిని ఎవరు కాపాడేవారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారులు సైకం బ్రహ్మయ్య, గొల్లపోతు సుబ్రహ్మణ్యం, పిన్ని జాలయ్య, గొల్లపోతు రామయ్య, సైకం నాగరాజు, గొల్లపోతు చరణ్, నాయుడు సుబ్రహ్మణ్యంతో పాటు 8 మంది మత్స్యకారులు శనివారం గల్లంతైన పర్యాటకులను కాపాడారు.
గతంలో బీచ్ ఫెస్టివల్ సమయంలో తీరంలో ఎర్ర జెండాలు పాతి వాటిని దాటి లోపలికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బీచ్ ఫెస్టివల్ ముగిసిన తర్వాత ఎర్ర జెండాలు తొలగించారు. ఎర్రజెండాలు ఉండి ఉంటే శనివారం ప్రమాదం జరిగేది కాదని పర్యాటకులు, మత్స్యకారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ పర్యాటకులను ప్రాణాలకు తెగించి మేము కాపాడతామని, కానీ, మైరెన్ పోలీసులు ఆ క్రెడిట్‌ను వారి ఖాతాలో వేసుకుని వారే కాపాడినట్లు ప్రకటించుకుంటారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 100 మందికిపైగా పర్యాటకుల ప్రాణాలు కాపాడామని మత్స్యకారులు తెలిపారు.


