బాబు మాట్లాడుతుండగానే.. | - | Sakshi
Sakshi News home page

బాబు మాట్లాడుతుండగానే..

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

తిరుగుముఖం పట్టిన జనం ఊకదంపుడు ఉపన్యాసంపై ఆసక్తి చూపని ప్రజలు అన్ని మండలాలకు బస్సులు పెట్టినా పెద్దగా రాని వైనం ఏరులై పారిన మద్యం

సింగరాయకొండ/కొండపి/టంగుటూరు/మర్రిపూడి: సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసం చేస్తుండగానే సభకు వచ్చిన జనం తిరుగుముఖం పట్టారు. జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సుమారు 30 వేల మంది జనాన్ని సమీకరణ చేయాలని నాయకులు భావించారు. అయితే, సభకు తక్కువ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఉదయం 11.45 గంటల వరకూ కూడా సభా ప్రాంగణంలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. 10:40 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రావాల్సి ఉండగా, దాదాపు గంటా 15 నిమిషాలు ఆలస్యంగా హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే వచ్చిన కార్యకర్తలు ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. బహిరంగ సభ వద్ద గంటల తరబడి కూర్చోవడానికి ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. సభలో దాదాపు రెండు గంటలు చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడంతో ప్రజలు ఆసక్తి కనబరచలేదు. అసలే చంద్రబాబు ఆలస్యంగా రావడంతో ప్రసంగం ప్రారంభించగానే బహిరంగ సభ వద్ద నుంచి ప్రజలు వెనుదిరిగారు. బహిరంగ సభ వద్ద కార్యకర్తలను కూర్చోబెట్టడానికి నాయకులు తీవ్రంగా కష్టపడ్డారు. అయినా అవేమీ లెక్క చేయకుండా చంద్రబాబు ప్రసంగించే సమయంలోనే బహిరంగ సభ ప్రదేశం నుంచి తమ వాహనాలు నిలిపిన ప్రాంతానికి వెళ్లారు. ఇదిలా ఉండగా 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ జరుగుతుందని నాయకులు ప్రకటించారు. కానీ, సభలో మీకిచ్చిన పాస్‌ పుస్తకాలు చూపండని అడిగినప్పుడు సుమారు 50 మందిలోపు మాత్రమే చేతులు పైకెత్తి పుస్తకాలు చూపించారు.

ఏరులై పారిన మద్యం.. కిక్కిరిసిన మద్యం దుకాణాలు...

బహిరంగ సభకు జనాలను తరలించడానికి నాయకులు నానా తంటాలు పడ్డారు. తెలుగు తమ్ముళ్లతో మద్యం దుకాణాలు కిక్కిరిసాయి. సభకు వచ్చేవారికి బహిరంగంగానే మద్యం అందజేశారు. సభా ప్రాంగణంలో మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు తూలుతూ కనిపించారు. ప్రజలను తరలించే బాధ్యతలను ఏపీఓలు, ఏపీఎంలకు అప్పగించడంతో ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను భారీ సంఖ్యలో నియోజకవర్గం నుంచి బస్సుల్లో తరలించారు. వీవోఏలు గ్రూప్‌ లీడర్లకు ఫోన్‌ చేసి తప్పనిసరిగా గ్రూపు సభ్యులందరినీ బహిరంగ సభకు తీసుకురావాలని, లేనిపక్షంలో తర్వాత ఎలా ఉంటుందో మీరే చూస్తారని బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. బస్సులను చంద్రబాబు మీటింగ్‌కు పంపడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

ఇబ్బందిపడిన రైతులు...

సీఎంఓ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11 గంటలకు రైతులతో ఇంటరాక్షన్‌ కావాల్సి ఉండగా, దాదాపు సాయంత్రం మూడున్నర ప్రాంతంలో రైతులతో చంద్రబాబు మాట్లాడారు. ఉదయం నిర్వహించాల్సిన కార్యక్రమం సాయంత్రం నిర్వహించడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతులతో సమావేశం కూడా తుతూమంత్రంగా నిర్వహించారని చర్చించుకుంటున్నారు.

సభకు పొదుపు సంఘాలు.. రైతుల తరలింపు...

సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని మంత్రి బాలవీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అందులో భాగంగా ప్రతి మండలానికి బస్సులు ఏర్పాటు చేసి జనాభాను తరలించే ఆలోచన చేశారు. ముఖ్యంగా మహిళా పొదుపు గ్రూపు సభ్యులతో పాటు ఉపాధి కూలీలను సైతం టార్గెట్‌ చేశారు. తప్పకుండా మీటింగ్‌కు తీసుకురావాలని హుకుం జారీ చేశారు. నియోజకవర్గ స్థాయిలో కనీసం 30 వేల మందిని సీఎం సభకు తరలించాలనే లక్ష్యంతో అధికారులు, టీడీపీ నేతలు కార్యాచరణలోకి దిగారు. అయితే ఒక్కో మండలం నుంచి కేవలం 1500 మందికి మించలేదు. గ్రామస్థాయిలోని ప్రజలను తరలించేందుకు నగదు, మద్యాన్ని ఎరచూపడం విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement