చుక్కనీరు కరువై రైతు ఆశల ఆవిరి 37 మండలాల్లో కరువు పరిస్థితులు సాధారణ వర్షపాతంలో 58 శాతం లోటు.. 1.44 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 39,521 హెక్టార్లకే పరిమితం పొలాల్లో పంటలు తగ్గి కూలీలకు పనులు కరువు పొట్టచేతబట్టుకుని వలసబాట రైతులకు అందాల్సిన కరువు సహాయం ఎప్పుడు? గత ఏడాది కరువు సహాయక చర్యలు ఎక్కడ?
ప్రకాశంలో...
సాయం కరువై..
కరువు కోరల్లో ఉమ్మడి ప్రకాశం
అనుమలవీడులో ఎండిపోయిన మిరప పంట
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం 1,41,351 (హెక్టార్లు)
సాగైంది 39,521(హెక్టార్లు)
మార్కాపురం జిల్లాలో సాగు విస్తీర్ణం 85,575
సాగు చేసింది 20,817
మార్కాపురం: ఈ ఏడాది ఖరీఫ్ రైతుకు కాలం కలసిరాలేదు. ఒక వైపు వాతావరణం సహకరించలేదు.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా అన్నదాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలోని 37 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ప్రకాశంలో 18, మార్కాపురం జిల్లాలో కంభం, రాచర్ల మినహా జిల్లాలోని మిగిలిన 19 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. కంభం, రాచర్ల మండలాల్లో సాధారణ వర్షపాతం కురవడం, కొద్ది విస్తీర్ణంలో పంటలు సాగవడంతో ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించలేదు. గత ఏడాది కూడా పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం నియోజకవర్గంలో మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ సహాయక చర్యలు చేపట్టకుండానే కాలం గడిచిపోయింది. దీంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు. ఇదిలా ఉంటే ఆరుగాలం కష్టపడి సాగుచేస్తే కనీస మద్దతు ధర లభించడంలేదు. ప్రభుత్వం సైతం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని వ్యవసాయ సంఘాలు మండిపడుతున్నాయి. గతేడాదిలాగే ఈ ఏడాది కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుంటే ఊరుకునే పరిస్థితిలేదని హెచ్చరిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కంది, పత్తి, మొక్కజొన్న, వరి, సజ్జ, రాగి, అక్కడక్కడా మిర్చిని సాగు చేస్తారు. అత్యధికంగా కంది, పత్తి సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఈ పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. 69 వేల హెక్టార్లలో కంది సాగుచేయాల్సి ఉండగా కేవలం 11.800 హెక్టార్లలో సాగైందంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అవగతమవుతుంది.
పనుల్లేక వలసలు
ఉమ్మడి జిల్లాలో సుమారు 7 లక్షల వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీరిలో పనులు చేసే వారి సంఖ్య 3.5 లక్షలు. రైతులు మరో 2 లక్షల మంది ఉన్నారు. ఇందులో పనులు లేక వలసలు పోతున్న వాళ్ళు 1.5 నుంచి 2 లక్షల మంది ఉంటారు. జిల్లా నుంచి గుంటూరు, కర్నూలు కు మిర్చీ కోతలకు, శ్రీకాకుళం, చిత్తూరు ప్రాంతాలకు చెరుకు కోతలకు వెళుతున్నారు. హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట, బెంగళూరు, చైన్నె లకు భవన నిర్మాణం పనులకు వెళుతున్నారు. గ్రామాల్లో పనులు లేక, ఉపాధి లేక వేలాదిగా పట్టణాలకు పొట్ట చేత పట్టుకొని పోతున్నారు. అక్కడా పనులు లేక అల్లాడుతున్నారు.
కరువు మండలాలు ఇవే...
జిల్లాలో మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పెద్దారవీడు, గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
సాయం చేయాలి..
పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయడం, అర్హులైన రైతుల వివరాలు నమోదు చేయడం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం సకాలంలో అందించాలి. పంటల బీమా పథకం వర్తించే ప్రాంతాల్లో బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది. అవసరమైన చోట పశువులకు తాగునీరు, మేత అందుబాటులో ఉంచాలి. సాగునీటి వనరుల లభ్యతను బట్టి నీటి నిర్వహణకు చర్యలు చేపట్టడం, ఉపాధి అవకాశాలు తగ్గిన ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి హామీ పనులను పెంచాలి. రైతులకు రుణభారం తగ్గించేందుకు ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం రుణాలపై వెసులుబాటు, రుణ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి. కరువు పరిస్థితులపై మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి, అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలి. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలు నమోదు చేసి, ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, నిబంధనల మేరకు అర్హులైన వారికి సకాలంలో ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది లాగా కాకుండా ఈ ఏడాదైనా కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
దొనకొండ, కురిచేడు, దర్శి, సింగరాయకొండ, ముండ్లమూరు, తాళ్లూరు, మద్దిపాడు, చీమకుర్తి, మర్రిపూడి, కొండపి, సంతలనూతలపాడు, ఒంగోలు రూరల్, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, వలేటివారిపాలెం, కందుకూరు, ఒంగోలు అర్బన్.


