ఒంగోలువన్‌టౌన్: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరక్టర్ నిర్మలా జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీలోపు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈ నెల 27వ తేదీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారని, ఈ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. వీరికి విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్‌లో ఉచిత శిక్షణ, భోజన, వసతి, స్టడీ మెటీరియల్ అందిస్తారన్నారు. శిక్షణ పొందగోరే అభ్యర్థులు తమ పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, కుల ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ పాస్ పుసక్తకం, ఫొటో స్టాట్ కాపీలతో 2 పాస్ పోర్టు సైజు ఫొటోలతో ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు 9989285530 నంబరుపై కార్యాలయం సమయాల్లో సంప్రదించవచ్చని తెలిపారు.
మార్కాపురం టౌన్: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంహెచ్‌సీ జేఏసీ కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 100 శాతం గ్రాస్ శాలరీని పునరుద్ధరించాలని, 2018 నుంచి అమలవుతున్న వేతన తగ్గింపును సమీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 14,600 మంది రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో వినతి పత్రాలు సమర్పించారు. ఈనెల 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 7వ తేదీన ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిరసన చేపడతామన్నారు. ఐసీయూ, క్యాజువాలిటీ, లేబర్ రూం, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా విధులు కొనసాగిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్ జీ కోటేశ్వరరావు, కన్వీనర్ అజయ్‌కుమార్‌తోపాటు జీజీహెచ్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్ షిప్ 2026 కు మార్కాపురం జిల్లా జట్ల ఎంపికలు సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 270 మంది క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా బాల బాలికల జట్లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 10, 11, 12 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడులో జరగనున్న 36వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో మార్కాపురం జిల్లా జట్టు తరఫున మొట్టమొదటి సారిగా పాల్గొననున్నారని అసోసియేషన్ సెక్రటరీ పి.దామోదర రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జవ్వాజి రామాంజుల రెడ్డి, అయ్యపరెడ్డి, అసోసియేషన్ బాధ్యులు చల్లా చెంచయ్య నాయుడు, ఓబులేసు, వ్యాయామ ఉపాధ్యాయులు హజరతయ్య, కోటేశ్వరరావు, జాహ్నవి ప్రియ, రోహిణి, నరసింహారావు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన సీనియారిటీ లిస్టులోని అభ్యంతరాలను ఈ నెల 6వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని డీఈఓ సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్‌కు సంబంధించి జోన్–3లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్స్ సీనియారిటీ లిస్టును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.


