● మీ కోసం కార్యక్రమంలో పోలీసు అధికారులు
ఒంగోలు సిటీ: ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)ఎన్.యుగంధర్‌బాబు పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఏఎస్పీతో పాటు పోలీస్ అధికారులు నేరుగా మాట్లాడి సమస్యలడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా విచారణ జరిపి నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఏఎస్పీ ఆదేశించారు. సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, అత్తారింటి వేధింపులు, తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, కొండపి ఎస్సై త్యాగరాజు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీసింగ్, సిబ్బంది పాల్గొన్నారు.


