అవినీతి వైద్యులపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవినీతి వైద్యులపై చర్యలు తీసుకోవాలి

Oct 6 2026 2:06 AM | Updated on Oct 6 2026 2:06 AM

● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

ఒంగోలువన్‌టౌన్‌: ఒంగోలు జీజీహెచ్‌లో సదరం సర్టిఫికెట్ల జారీలో అవినీతికి పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ కాలేషా సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. జీజీహెచ్‌లో సదరం సర్టిఫికెట్ల జారీలో అవినీతికి పాల్పడుతున్న న్యూరాలజీ డాక్టర్‌ సామాజాల హరిపై వచ్చిన ఫిర్యాదులపై గత నెలలో విచారణ నిర్వహించారని తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామన్నారని, ఆ సమయంలో విభిన్న ప్రతిభావంతులపై వైద్యులు ఇష్టారీతిన మాట్లాడారని అధికారుల దృష్టికి తెర్చారు. వారిపై దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడుతున్న న్యూరాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సామజాల హరిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.మాణిక్యరావు ఈ నెల 1వ తేదీ విచారణకు ఆదేశాలు జారీ చేశారన్నారు. విచారణకు ఆదేశించి బాధిత దివ్యాంగులను రావాలని కోరడంతో పలువురు దివ్యాంగులు, సంఘ నాయకులు కూడా హాజరయ్యారన్నారు. ఆ సమయంలో విచారణ కమిటీ సభ్యుడు డాక్టర్‌ మస్తాన్‌బాషా ‘మిమ్మల్ని మేము పిలవలేదు.. మీరెందుకు వచ్చారు’ అంటూ ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా దివ్యాంగులను మాట్లాడాని, దానిపై అక్కడే వారు నిరసన వ్యక్తం చేశారని వివరించారు. వీటన్నింటిని చూస్తుంటే డాక్టర్‌ హరిని రక్షించడానికి సూపరింటెండెంట్‌తో పాటు విచారణ కమిటీ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోందని అన్నారు. దివ్యాంగుల పట్ల వివక్ష చూపకుండా వెంటనే డాక్టర్‌ హరిపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్టుమెంట్‌చే విచారణ జరిపి శాఖాపరమైన చర్యలతో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ముల్లా మదర్‌వలి, కృష్ణ, వహీదా, జిలాని, సయ్యద్‌ ఆరిఫా, రజాక్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement