పొదిలి: వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే, ఆక్రమణలు పెరిగిపోతుంటే అధికారులు దానిని అడ్డుకోనందుకు నిరసనగా తాము కమిటీ మొత్తం రాజీనామా చేశామని పొదిలి వక్ఫ్‌బోర్డు మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ షుకూర్ స్పష్టం చేశారు. తన స్వగృహంలో సోమవారం కమిటీ సభ్యులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మేనేజింగ్ కమిటీలో కొనసాగుతున్న తాము ఏప్రిల్ 24వ తేదీన రాజీనామాలు సమర్పించామన్నారు. పెద్ద మసీదుకు సంబంధించిన వక్ఫ్ స్థలాలు, భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని గతంలో పలుమార్లు జిల్లా అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేశామని చెప్పారు. అయినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో హైకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆక్రమణలు తొలగించలేకపోయారన్నారు. కోర్టు ఆదేశాలు అమలు కాలేదనే కారణంలో న్యాయపరమైన చర్యలో భాగంగా కంటెప్ట్ ఆఫ్ కోర్టు ప్రక్రియను కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. అయితే పలు కారణాల వల్ల మధ్యలోనే చర్యలు ఆపేశారన్నారు. దీంతో మనస్థాపం చెంది రాజీనామాలు చేశామని తెలిపారు. రాజీనామాల విషయంలో కూడా వక్ఫ్ బోర్డు నుంచి సమాధానం లేదన్నారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు మసీదు ఆస్తులతో వచ్చే ఆదాయం ఖర్చులపై పలు ఆరోపణలు చేశారని, సంబంధిత రికార్డులు కమిటీ సెక్రటరీ నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తున్నారని, బోర్డు కార్యాలయంలో లెక్కలు సమర్పిస్తున్నామని తెలిపారు. ఎవరైనా సమాచారం కావాలంటే అధికారికంగానే కోర్టు నుంచి పొందవచ్చని సూచించారు. తాము ఏదైనా అవకతవకలకు పాల్పడి ఉంటే, బోర్డు విచారణ చేపట్టి తాము తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంత మంది ముస్లింలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిగిలిన వారిని తప్పుదోవ పట్టిస్తూ కమిటీ సభ్యులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో కొందరు బెదిరింపు ధోరణితో మాట్లాడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి బెదిరింపు ధోరణులు, బలవంతపు చర్యలు ఏ విధంగానూ సమర్ధనీయం కాదన్నారు. తాను రెండు రోజుల క్రితం మసీదుకు వెళ్లివస్తుంటే, సలీం అనే వ్యక్తి తనపై దాడి చేశారన్నారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వ్యక్తిగత విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టాలని, పవిత్ర మసీదుల విషయంలో వాటి ప్రభావం లేకుండా చూడాలన్నారు. పవిత్ర ప్రార్ధనా స్థలాల పేరుతో గొడవలు, రాజకీయాలు, వ్యక్తిగత వ్యవహారాలు, పరస్పర దూషణలు సరికాదన్నారు. మేము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని పవిత్ర ఖురాన్ మీద ప్రమాణం చేస్తామని, మా మీద ఆరోపణలు చేసే వారు కూడా సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవిస్తూ మసీదుల శాంతి, పవిత్రతను కాపాడేందుకు ఐక్యంగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు. సమావేశంలో కమిటీ సభ్యులు కోశాధికారి ముల్లా ఖాదర్‌వలి, ముల్లా ఖాదర్‌బాష (పాపారాయుడు), ముల్లా ఖాదర్ బాష, ముల్లా ఖలీల్ పాల్గొన్నారు.


