ఒంగోలు సబర్బన్: చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 7వ తేదీ 12వ చేనేత దినోత్సవాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒంగోలులోని ప్రకాశం భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్ మీదుగా కలెక్టర్ బంగ్లాకు చేరుకుంటామన్నారు. అక్కడ కలెక్టర్ పి.రాజాబాబు చేనేతలను ఘనంగా సన్మానిస్తారని తెలిపారు.
● దీనివెనుక మర్మమేమిటో చంద్రబాబు చెప్పాలి
● 10న జైలు భరో
● సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు ధరలపై సమీక్ష నిర్వహించినప్పుడల్లా ధరలు తగ్గిపోతున్నాయని, దీని వెనుక రహస్యం ఏమిటో ఆయనే చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని తరిమెల నాగిరెడ్డి భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పాలిట ఆపద్బాంధవులుగా నిలబడాల్సిన పాలకులు యమధర్మరాజులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి ఒకరోజు ముందు ఏ రకమైన పొగాకునైనా కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాల్సిందిగా చంద్రబాబు జూన్ నెలలో ఆదేశించారని, అవేమీ అమలు కాలేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయని కార్పొరేట్ వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. జూలై 29వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడితే.. ఒకరోజు ముందు 28వ తేదీ చంద్రబాబు గ్రేడ్–1 రకం పొగాకు కిలో రూ.230కి, మీడియం రకం 190కి, లో గ్రేడ్ రకం 110కి కొనుగోలు చేయాలని చెప్పడం, ధరల్లో వ్యత్యాసానికి కిలోకు రూ.20 సహాయం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలచే కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే.. రూ.20 ఇస్తామని ప్రకటించడంలో ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని రంగారావు నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చులకనగా చూస్తున్నాయని, న్యాయం చేస్తున్నట్లు నటిస్తూ రైతుల గొంతులు కోయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయమని అడుగుతుంటే కార్పొరేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వైఖరికి నిరసనగా ఈ నెల 10వ తేదీ జైలు భరో కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. క్విట్ ఇండియా డేని పురస్కరించుకుని ఒంగోలు, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి కేంద్రాలుగా జైలు భరో చేపట్టనున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో నాయకులు ఎస్.లలిత కుమారి, జజ్జూరి జయంతిబాబు, పరిటాల కోటేశ్వరరావు, గుళ్లాపల్లి వెంకటరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి ఢాయి ఆఖర్ జాతీయ లేఖా రచనా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ మహ్మద్ జాఫర్ సాధిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత పెంపొందించడం, లేఖా రచన కళను ప్రోత్సహించడం, సృజనాత్మకతను వెలికి తీయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. పోటీలు రెండు విభాగాలలో ఉంటాయన్నారు. ఎన్వలప్ విభాగంలో ఏ4 సైజు పేపర్‌పై గరిష్టంగా 1000 పదాలతో లేఖ రాయాలన్నారు. ఇన్‌ల్యాండ్ లెటర్‌కార్డు విభాగంలో గరిష్టంగా 500 పదాలతో లేఖ రాయాలన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం లేదా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భారతీయ భాషలోనైనా స్వహస్తాలతో లేఖలు రాయాలన్నారు. టైపు, కంప్యూటర్ ముద్రణలను పోటీలకు అనుమతించరన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందించనున్నట్లు చెప్పారు. పాల్గొనదలచిన వారు తమ లేఖలను అక్టోబర్ 31వ తేదీలోపు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ప్రకాశం డివిజన్, భాగ్యనగర్ 2వ లైన్, ఒంగోలు–523001 అనే చిరునామాకు పంపించాలన్నారు.


