పామూరు కొత్తచెరువులో లేఅవుట్‌లు వేసి రూ.కోట్లు దండుకునేందుకు టీడీపీ నేతల యత్నం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు ఇటీవల ప్రత్యేక ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో జేసీకి ఫిర్యాదు నేటికీ చర్యలు శూన్యం
పామూరు: చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. మట్టి, ఇసుక, మద్యం అక్రమ అమ్మకాలతో పాటు వాగు, వంకలు, చెరువులను కూడా ఆక్రమించి సొమ్ము చేసుకునేందుకు తెగబడుతున్నారు. మండల కేంద్రమైన పామూరులోని కందుకూరు రోడ్డులో గతంలో సర్వే నంబర్ 398లో 6.40 ఎకరాల తొట్టి ప్రాంతంతో కొత్త చెరువును నిర్మించారు. ఈ చెరువు నీటితో భూగర్భ జలాలు పెరగడంతో పాటు, చెరువులో చేపలకు వేలం నిర్వహించడం ద్వారా పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. చెరువులోని పెద్దబావి, ఆర్‌డబ్ల్యూఎస్ వారు నిర్మించిన బావుల్లో సమృద్ధిగా నీరు ఉండి నీటి ఇక్కట్లు తప్పడంతోపాటు పశువులకు తాగునీరు లభిస్తోంది. అదేవిధంగా చెరువు కింద ఉన్న ఆయకట్టులోని రైతులు ఆరుతడి కింద పంటలు సాగుచేసుకుంటున్నారు. ఇటువంటి చెరువు క్రమేణా ఆక్రమణలకు గురై కొన్నిచోట్ల భనాలు వెలిశాయి. మరికొందరు చెరువు తొట్టిప్రాంతంలో, అలుగు సమీపంలో లేఅవుట్‌లు వేసి స్థలాలను రూ.లక్షలకు అమ్ముకుని జేబులు నింపుకున్నారు. 86.40 ఎకరాల చెరువుతొట్టి ప్రాంతం క్రమేణా ఆక్రమణలకు గురై ప్రస్తుతం సుమారు 20 నుంచి 40 ఎకరాల లోపు మాత్రమే మిగిలిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కొందరు అధికార టీడీపీ నాయకులు చెరువు మధ్యలో కట్టవేసి అవతలి ప్రాంతం తమదేనని చెబుతూ ఆక్రమణలకు తెగబడ్డారు. ఈవిషయం తెలిసిన ఇరిగేషన్ అధికారులు చెరువును సందర్శించడంతో పాటు ఆక్రమణల పనులను తాత్కాలికంగా ఆపేశారు. చెరువు నుంచి తూముల ద్వారా నీరు పొలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కాల్వలను సైతం పూడ్చేస్తున్నారు. చెరువు కోసం కేటాయించిన భూమిని సర్వేచేసి హద్దురాళ్లు వేయకపోతే మిగిలిన భూమి కూడా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని, భవిష్యత్‌లో పామూరుకు నీటి ఇక్కట్లు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పామూరులో జరిగిన ప్రత్యేక ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో సీపీఎం నాయకులు, పట్టణ ప్రజలు చెరువు ఆక్రమణలను తొలగించి చెరువును కాపాడాలని వినతిపత్రం అందజేశారు.


